31 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఇస్మార్ట్‌ నిర్లక్ష్యం… స్మార్ట్‌ సిటీలకు నిధులివ్వని కేంద్రం!

హైదరాబాద్: స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్‌సిఎం) కింద కరీంనగర్, వరంగల్‌ల అభివృద్ధికి గత మూడేళ్లనుంచి నిధులు అందజేస్తున్నామన్న కేంద్రం వాదన వాస్తవం కాదని… కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక సోమవారం బట్టబయలు చేసింది.

బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌లకు స్మార్ట్ సిటీస్ మిషన్ కింద సహాయాన్ని అందించింది. అయితే సరైన ఆర్థిక సహాయం అందించే విషయంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్ష తాజాగా బయటపడింది.

గత మూడేళ్లలో గుజరాత్‌కు రూ.563.50 కోట్లు, పొరుగున ఉన్న కర్ణాటకకు రూ.1,240.16 కోట్లు నిధులు రాగా, ఉత్తరప్రదేశ్‌కు భారీఎత్తున 1722 కోట్ల రూపాయలు నిధుల్ని కేంద్రం అందజేసింది. ఇదేసమయంలో తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా రాలేదు.

గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOHUA), స్మార్ట్ సిటీస్ మిషన్ కింద రాష్ట్రాలకు ఏమేరకు నిధులు విడుదల చేసిందో అధికారిక నోట్‌లో పేర్కొంది. జూలై 8, 2022 నాటికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల కోసం రూ.30,751.41 కోట్లు విడుదల చేసిందని పేర్కొంది. వీటిలో రూ.27,610.34 కోట్లు (90 శాతం) వినియోగించబడ్డాయి.

స్మార్ట్ సిటీస్ మిషన్ జూన్ 25, 2015న ప్రారంభించారు. జనవరి 2016 నుండి జూన్ 2018 వరకు నాలుగు రౌండ్ల పోటీల ద్వారా 100 స్మార్ట్ సిటీలు ఎంపిక చేశారు. ఎస్.సీ.ఎం మార్గదర్శకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ప్రతి నగరానికి సంవత్సరానికి రూ.100 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అదేవిధంగా అంతే సమాన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి.

2015-16 నుండి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన  నిధుల పరంగా చూస్తే… గుజరాత్ రూ.2,139.50 కోట్లు పొందింది.  అది రూ.2024.74 కోట్లు వినియోగించుకుంది. అదేవిధంగా కర్ణాటకకు రూ.2618.16 కోట్లు రాగా రూ.2419.95 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.3142 కోట్లు వచ్చి రూ.2699.34 కోట్లు వినియోగించుకున్నాయి. తెలంగాణకు కేవలం రూ.392 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆ మొత్తం నిధులను వినియోగించుకుంది.

ఈ నిధుల వివరాలను టీఎస్ఎండీసీ చైర్మన్ ఎం.క్రిశాంక్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. “స్మార్ట్ సిటీస్ మిషన్ కోసం రాష్ట్రాలకు రూ.48,000 కోట్లు అందించామని చెప్పుకుంటున్న భారత ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీనిపై పార్లమెంటులో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీలకు ధైర్యం ఉందా? అని టీఎస్ఎండీసీ చైర్మన్  అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లిగా వ్యవహరించడం పట్ల ట్విట్టర్ వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “తెలంగాణ వరదలకు నిధులు ఇవ్వలేదు, ఇప్పుడు బిజెపి రాష్ట్రాన్ని విస్మరిస్తోందని స్పష్టమైంది” అని  హైదారాబాదీలు ట్వీట్ చేశారు.

మొత్తంగా ఈ విమర్శలను గమనించిన పీఐబీ (PIB) అధికారులు ఇచ్చిన సమాచరంతో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MOUHA) తన అధికారిక నోట్‌ను ఉపసంహరించుకోవడం కొసమెరుపు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles