28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్‌లో నేడు 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ప్రారంభం!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్‌లో పచ్చదనానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హరితహారం పేరుతో తెలంగాణకు మణిహరం లాంటి అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులను తీర్చిదిద్దింది. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. నగరవాసులకు మానసిక ఉల్లాసంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నేడు ఉదయం 9 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ తరువాత వరుసగా 10.35 గంటలకు పల్లెగడ్డ, 11 గంటలకు సిరిగిరిపూర్, 11.30 గంటలకు శ్రీనగర్, మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూర్, 12.40 గంటలకు మన్యం కంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను ప్రారంభించారు.

సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా న‌గ‌రాల‌కు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్‌ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్‌ స్పేస్‌లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్‌లను అటవీ శాఖ, హెచ్ఎండిఏ కలిసి వీటిని అభివృద్ధి చేస్తున్నారు. మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్‌కు నలువైపులా వీటిని ఏర్పాటు చేశారు.

అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు.. . ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు, స్వ‌చ్చ‌మైన ప్రాణ‌వాయువును అందించేందుకు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు దోహదం చేయనున్నాయి. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా  అనేక కొత్త కాలనీలు, నివాస ప్రాంతాలు వెలిశాయి. దీంతో శివారు ప్రాంతాలను ఆనుకొని ఉన్న పట్టణ అడవుల్లో కొంతభాగాన్ని  ఉద్యానాలుగా మార్పు చేయడం వల్ల  వివిధ ప్రాంతాల ప్రజలకు పార్కుల్లో ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో  త్వరలో 59 పార్కులు అందుబాటులోకి రానున్నాయి.

ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా  పెద్ద ఎత్తున మొక్క‌ల‌ను నాటారు. ఆహ్లాదానికి నిలయంగా ఏర్పాటు చేసే అర్భన్‌ ఫారెస్ట్రీ బ్లాకుల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే వారు, నగరం నుంచి కుటుంబసభ్యులతో పార్కుకు వెళ్లి సేదతీరేలా సుందరంగా తీర్చిదిద్దారు.

సంద‌ర్శ‌కుల‌ను అకట్టుకునేలా యోగా షేడ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, గజీబో, ఆట‌విడుపు కోసం చిన్న పిల్ల‌లకు ప్ర‌త్యేక ఆట స్థ‌లం, కుంటుంబంతో హాయిగా సేద‌తీరేలా పిక్నిక్ ఏరియా, నేచుర‌ల్ రాక్ సిట్టింగ్, త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను క‌ల్పించారు. సంద‌ర్శ‌కుల‌కు వినోదంతో పాటు విజ్ఞానం అందించేలా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, అడ‌వుల ప్రాధ‌న్య‌త గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌త్యేకంగా ఒపెన్ క్లాస్ రూంల‌ను  ఏర్పాటు చేశారు.

అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధిని వరల్డ్‌ ఫారెస్ట్‌ సైన్స్‌ గుర్తించడం మరో విశేషం. నగరంలో పచ్చదనం పెంపుదలతో పాటు కాలుష్యం బారిన పడకుండా అటవీ, మున్సిపల్‌ శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరానికి ఎఫ్‌ఏఓ నుంచి ‘ట్రీ’ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌ ట్యాగ్‌ లభించడానికి విశేషంగా కృషి చేశాయి.

స్వచ్ఛమైన గాలి.. ఆహ్లాదకర వాతావరణం
రోజురోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్యం..పనిఒత్తిడి..వెరసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్భన్‌ ఫారెస్ట్‌ బ్లాకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 16 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలో అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులను ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5928.38 హెక్టార్లలో రూ.96.64 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఆయా ఉద్యానవనాల్లో లక్షలాది మొక్కలను నాటారు. కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మాణం, కనువిందు చేసే ప్రవేశద్వారం పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles