23.7 C
Hyderabad
Monday, September 30, 2024

‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’… వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశం!

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్‌ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా’న్ని ఘనంగా నిర్వహించనున్నది. ఈ సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’కార్యక్రమంపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కె. కేశవరావు నేతృత్వంలోని ఉత్సవ కమిటీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీలు, నగర, పురపాలికల్లో ప్రత్యేక సమావేశాలుంటాయని వెల్లడించారు. ఉత్తమ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, వైద్యుడు, ఇంజినీర్‌, పోలీస్‌ అధికారి, కళాకారుడు, గాయకుడు, కవి తదితరులను గుర్తించి సత్కరిస్తామని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గృహాలపై ఎగురవేసేందుకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.

8న ఘనంగా ఉత్సవాల ప్రారంభం
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఆగస్టు 8న వజ్రోత్సవ ప్రారంభ సమారోహాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్మీ, పోలీస్‌ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం, ఆసుపత్రులు వంటి అన్ని ప్రభుత్వ భవనాలకు ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే అన్నిచోట్ల పక్షం రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేస్తారు. హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా తమ ప్రాంగణాలను అలంకరించుకోవాలని సీఎం సూచించారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు దేశభక్తి కవితల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఉదయం జరిగే సభలో దేశభక్తి గీతాలు ఆలపించాలని విద్యా సంస్థలకు సూచించారు.

స్వాతంత్య్ర పోరాటాన్ని స్మరించుకునేందుకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనాలు, ముషాయిరాలు కూడా నిర్వహించనున్నారు. ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీలు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో జరుగుతాయి. ఈ సందర్భంగా ఫ్రీడమ్ 2కె రన్ నిర్వహించనున్నారు. అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టనున్నారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ప్రత్యేక జనరల్‌బాడీ సమావేశాలు నిర్వహించడమే కాకుండా హైదరాబాద్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఆగస్టు 14 రాత్రి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌తో పాటు అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో బాణసంచా కాల్చి… ఘనంగా నిర్వహించనున్నారు.

పక్షం రోజుల పాటు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల నేతృత్వంలో ఆర్గనైజింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, డాక్టర్, ఇంజనీర్, పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులు, కళాకారుడు, గాయకుడు, కవి/రచయితలను ఎంపిక చేసి సత్కరించాలని సూచించారు.

వజ్రోత్సవాల షెడ్యూల్‌

  • ఆగస్టు 08: వజ్రోత్సవ ప్రారంభ కార్యక్రమం.
  • ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ.
  • ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామాల్లో మొకలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు.
  • ఆగస్టు 11: ఫ్రీడం రన్‌ నిర్వహణ.
  • ఆగస్టు 12: రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల
    ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి.
  • ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ
    సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు..
  • ఆగస్టు 14: సాయంత్రం.. సాంస్కృతిక సారథి కళాకారుల చేత
    నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక, జానపద
    కార్యక్రమాలు. ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు.
  • ఆగస్టు 15: స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ.
  • ఆగస్టు 16: ‘ఏకకాలంలో, ఎకడివారకడ ’తెలంగాణ వ్యాప్తంగా
    సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.
  • ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ.
  • ఆగస్టు 18: ఫ్రీడం కప్‌ పేరుతో క్రీడల నిర్వహణ.
  • ఆగస్టు19: దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ.
  • ఆగస్టు 20: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీ.
  • ఆగస్టు 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతోపాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.
  • ఆగస్టు 22: ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles