33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణపై కేంద్ర సర్కారు కక్ష… కరెంట్ కొనుగోలు, అమ్మకంపై నిషేధం!

హైదరాబాద్: తెలంగాణ సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని పేర్కొంది. తెలంగాణ, ఏపీలతోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ పరిధిలోని పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పొసోకో) ఆయా రాష్ట్రాలకు వర్తమానం పంపింది.  ఈ ఆంక్షలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యుత్ ప్లాంట్లకు బకాయిలు క్లియర్ అయ్యే వరకు తెలంగాణ విద్యుత్ కొనుగోలు లేదా అమ్మకాలు జరగకుండా కేంద్రం తీవ్ర పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ  రూ.1,370 కోట్ల బకాయిలు చెల్లించిన విషయాన్ని కూడా కేంద్రం విస్మరించటం సరికాదని చెప్పింది.

నిజానికి పీపీఏ ప్రకారం జనరేటర్లు, డిస్కంలకు మధ్య మూడో సంస్థ ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం లేదు. అయితే విద్యుత్తు కొనుగోళ్లు, అమ్మకాలపై ఎన్‌ఎల్‌డీసీ పర్యవేక్షణ ఉండకూడదని, గ్రిడ్‌ డిసిప్లిన్‌కు మాత్రమే పరిమితమయ్యేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ విద్యుత్తు సంస్థలు హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నా కేంద్ర విద్యుత్తు శాఖ, ఎన్‌ఎల్‌డీసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కోర్టుకు విన్నవించాయి. దీంతో విద్యుత్తు కొనుగోలు సంస్థలపై అనర్హత వేటు వేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. అయినా కేంద్రం నిషేధం విధించటం గమనార్హం.

విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొన్న కరెంటుకు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించలేదన్న కారణంతో ఈ చర్యలు తీసుకోవడంపై హైకోర్టును ఆశ్రయించనుంది. గతంలో హైకోర్టు స్టే ఇచ్చి నా విద్యుత్తు ఎక్స్‌చేంజ్‌లో ఇబ్బందులు పెట్టడం సరికాదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. కేంద్రం మరోసారి రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని విమర్శించారు.

‘రాష్ట్రంలో విద్యుత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకొంటున్నాం. అందుబాటులో జల విద్యుత్తు ఉండటం మనకు కలిసి వచ్చేదే. ప్రజలు, వినియోగదారులు, విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు.

ఆకస్మిక పరిణామంతో, విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  కేంద్రం నిర్ణయంతో 13 రాష్ట్రాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles