23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

డీలిమిటేషన్‌లో దక్షిణాది పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గనుంది… మంత్రి కేటీఆర్ ఆందోళన!

హైదరాబాద్: సమర్థవంతమైన జనాభా నియంత్రణ చర్యల కారణంగా కేంద్రం లోక్‌సభ నియోజకవర్గాల విభజన చేస్తే భవిష్యత్తులో దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటు స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మంత్రి కెటి రామారావు (కెటిఆర్) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.  జాతీయ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 1951లో 26.2% నుండి 2022లో 19.8%కి తగ్గిందని సూచిస్తూ ‘స్టాట్స్ ఆఫ్ ఇండియా’ నుండి కేటీఆర్‌ ఒక ట్వీట్‌ను పంచుకున్నారు.

“జనాభాతో సహా అనేక విషయాల్లో దక్షిణ భారత రాష్ట్రాలన్నీ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. నాకున్న సమాచారం మేరకు డీలిమిటేషన్‌లో పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గించడం ద్వారా మనకు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే జరిగితే, న్యాయాన్ని అపహాస్యం చేసినట్టే, ”అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను తన ప్రాతిపదికగా ఉపయోగించుకున్న తర్వాత, దక్షిణాది రాష్ట్రాలకు నిధుల తగ్గించారు. ఇపుడు జనాభాను సమర్థవంతంగా నియంత్రించినందుకు బహుమతిగా పార్లమెంటరీ సీట్లను కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలు మెజారిటీ సూచీలలో ఉత్తరాది ప్రత్యర్ధులను అధిగమించాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు నిధులు మరియు పన్నుల పంపిణీని సిఫార్సు చేయడం ప్రామాణిక పద్ధతి. ఇది దక్షిణాది రాష్ట్రాలపై ఆర్థిక,  రాజకీయ ప్రభావాన్ని చూపింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈరోజు లోక్‌సభ స్థానాలను పునర్విభజన చేస్తే, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ఐదు దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుత 129 లోక్‌సభ స్థానాల్లో 33 స్థానాలను కోల్పోతాయని అంచనా. కఠినమైన కుటుంబ నియంత్రణ చర్యలు ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తక్కువ జనాభా పెరుగుదలను నమోదు చేశాయి. అయితే ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు అధిక జనాభా పెరుగుదలను నమోదు చేయడం విశేషం.  మెరుగైన పనితీరు కనబరిచిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటరీ సీట్ల తగ్గింపు రూపంలో  జరిమానా విధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles