23.7 C
Hyderabad
Monday, September 30, 2024

కేంద్రం పెత్తనాన్ని సహించం… ఆర్థిక మంత్రి టి.హరీష్‌రావు!

హైదరాబాద్: కేంద్రం నిధులతో అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ప్రదర్శించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు. నరేంద్రమోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు రేషన్‌ షాపుల్లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫొటో పెట్టారా? అని సూటిగా ప్రశ్నించారు.  ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తేవడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలని సూచించారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సమాఖ్య స్ఫూర్తిని విస్మరిస్తున్న ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్షపూరిత వైఖరిని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలు తమ సహకారాన్ని పెంచాలని ఒత్తిడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్‌ఎస్‌)లో తన వాటాను తగ్గించడమే కాకుండా అనేక పథకాలను ఆకస్మికంగా రద్దు చేసిందని గుర్తు చేశారు.

“కేంద్ర-రాష్ట్ర వాటాలు రెండింటినీ కలిగి ఉన్న కొన్ని పథకాలు కొన్ని రాష్ట్రాలకు ఉపయోగపడవు. అయితే రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడే విధంగా అన్ని పథకాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఒత్తిడి చేస్తోంది. తెలంగాణకు ఉపయోగపడే ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వంటి పథకాల్లో కేంద్రం ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తూ వాటి అమలును కష్టతరం చేస్తోంది’’ అని అన్నారు. సీఎస్‌ఎస్‌ పేరుతో కేంద్రం రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలను (CSS) తగ్గించి, రాష్ట్రాలకు ఐచ్ఛిక పథకాలను ప్రవేశపెట్టాలని… నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉపసంఘం సిఫార్సులను అమలు చేసేందుకు కేంద్రం ఎందుకు వెనుకాడుతోంది అని ఆర్థిక మంత్రి ప్రశ్నించారు.. “మీ పథకాలు నిజంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా ఉన్నాయా లేక ప్రచార స్టంట్‌ల కోసమేనా అని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని పునఃసమీక్షించాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు గురించి మీడియా ప్రశ్నిస్తే నిర్మల తప్పించుకొనే ప్రయత్నం చేశారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘రాజ్యాంగం ప్రకారం రుణాలను నియంత్రించే హకు కేంద్రానికి ఉన్నదని మీరు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పరిధి దాటి ఎలా అప్పులు చేస్తున్నది? మీకు రాజ్యాంగం ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చిందా?’ అని ప్రశ్నించారు.

దేశంలో మాంద్యం లేదన్న నిర్మలా సీతారామన్ వాదనను కూడా హరీష్‌రావు కొట్టిపారేశారు. జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 2016-17లో 8.26 శాతం నుంచి 2018-19లో 6.53 శాతానికి, ఆ తర్వాత 2019-20లో 3.66 శాతానికి పడిపోయిందని ఆయన సూచించారు. “కేంద్ర ఆర్థిక మంత్రిగా, రూపాయి విలువ కొత్త కనిష్ట స్థాయిలకు ఎందుకు పడిపోతుందో.. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణాలేంటో నిర్మలాసీతారామన్ వివరించాలి. అంతా బాగుందని కేంద్రం చెబుతూ ప్రజలను ఎక్కువ కాలం అంధకారంలో ఉంచలేదు’’ అని హరీష్‌రావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణకు రావాల్సిన రూ.7,103 కోట్లు విడుదల చేయలేదని ఆర్థిక మంత్రి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదని, రాష్ట్రానికి మంజూరైన ప్రాజెక్టులతో పాటు సంస్థలను రద్దు చేయడం ద్వారా రాష్ట్రంపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.

“నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌లు (NIMZ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) రద్దు; వైద్య, విద్యా సంస్థల కేటాయింపులో అనిశ్చితి, ఇతరత్రా నిధులు విడుదల చేయకపోవడం తెలంగాణ పట్ల వివక్ష తప్ప మరొకటి కాదు. తాజాగా, దేశంలోనే అతిపెద్ద బల్క్ డ్రగ్ ఉత్పత్తిదారుగా ఉన్న తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్‌ను నిరాకరించడం కేంద్రం పక్షపాత వైఖరిని తెలియజేస్తోందని మంత్రి అన్నారు.

ఉచితాలు వద్దంటూ పేదల నోట్లో మట్టి కొట్టేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రయత్నించారని విమర్శించారు. కార్పొరేట్లకు చెందిన రూ.లక్షల కోట్ల రుణాలను ఎవరి ఆమోదంతో రద్దు చేశారో దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

సెస్‌ రూపంలో వచ్చే నిధులను కేంద్రం తనకు ఇష్టమైన రాష్ట్రాలకు ఇస్తూ, అనుకూలంగా లేని రాష్ట్రాలకు మొండి చేయి చూపుతున్నదని  హరీష్‌రావు మండిపడ్డారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ ప్రకారం ఆదాయంలో సర్‌ చార్జీలు, సెస్‌లు కలిపి దాదాపు 20% ఉన్నాయని, దీంతో చట్టబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన 41% పన్నుల్లో వాటా దక్కడం లేదని, 29.6% మాత్రమేనని వస్తున్నదని ఆయన తెలిపారు.

అప్పులను తీర్చగలిగే స్థోమత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, అయినా తెలంగాణ రుణాలపై కేంద్రం ఆంక్షలను కూడా మంత్రి తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 23.5 శాతంగా ఉందని, జీఎస్‌డీపీలో అప్పులు 35.4 శాతంగా ఉన్నాయని గుర్తు చేశారు. పంట రుణాల మాఫీ విషయంలో నిర్మలా సీతారామన్ తప్పుడు ఆరోపణలు చేశారని, సగం నిజం మాట్లాడుతున్నారని ఆరోపించారు. 55.4 శాతానికి పైగా పంట రుణాలను మాఫీ చేశామని ఆర్థికమంత్రి హరీష్‌రావు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం 65 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే రైతు బంధు పథకానికి రూ. 57,880 కోట్లు ఖర్చు చేసి, 1.5 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలను వెచ్చించడమే కాకుండా గత ఎనిమిదేళ్లలో 25.78 లక్షల వ్యవసాయ పంపులకు ఉచిత విద్యుత్‌ను అందించింది. రైతుల కోసం మనకంటే బాగా పనిచేసిన బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవో చేప్పమని నిర్మలా సీతారామన్‌కు హరీష్ రావు సవాల్ విసిరారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2019-21 తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నమోదు కాలేదని ఆయన గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేయలేదని నిర్మల పచ్చి అబద్ధం చెప్పారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. డీపీఆర్‌ సమర్పించకుండానే కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. డీపీఆర్‌ సమర్పించకుండానే రూ.80,190 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖ అనుమతులు ఎలా జారీ చేశాయో వివరించాలని ఆయన ఆమెకు సవాల్ విసిరారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles