23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణలో సెప్టెంబరు 17 రాజకీయం… బీజేపీ. టీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు!

హైదరాబాద్: రాష్ట్రంలో సెప్టెంబర్ 17 రాజకీయం వేడెక్కుతోంది. హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 సంస్మరణ సందర్భంగా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర ప్రభుత్వం పోటా పోటీగా సెప్టెంబర్ 17 న అధికారిక కార్యక్రమాల నిర్వహణకు సిద్దమయ్యాయి. కాంగ్రెస్, ఎంఐఎం కూడా తమ కార్యాచరణను ప్రకటించాయి.

సెప్టెంబర్ 17నాటి కార్యక్రమాలతో సెంటిమెంట్ రగిలించాలని పార్టీలు పోటీ పడుతున్నాయి. స్వయంగా కేంద్రం రంగంలోకి దిగి విమోచన దినోత్సవం జరుపుతామని ప్రకటించడం, కౌంటర్ గా టీఆర్ఎస్ కూడా జాతీయ సమైక్యత దినంగా పాటిస్తాం అనడం ఆసక్తి కలిగిస్తోంది.

తెలంగాణ ఏర్పాటైన దగ్గర్నుంచీ సెప్టంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో జరుపుతూ వచ్చాయి. అయతే ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించడం లేదు. ఏటా సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా.. విలీనమా, విమోచనా.. విద్రోహమా అనే చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడూ లేనంత హడావుడి ఈసారి కనిపిస్తోంది. కేంద్రం హైదరాబాద్ సంస్థానం విమోచన ఉత్సవాలు నిర్ణయించడం, ఏడాది పాటు జరపాలని ప్రకటించడం కలకలం రేపింది.

కేంద్రం ప్రకటన రాగానే.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చింది.సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా జరిపి.. ఏడాది పాటు వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమం జరపాలని భావిస్తోంది. స్వాతంత్ర్య అమృతోత్సవాల్ని ఎలా అయితే కేంద్రానికి పోటీగా జరిపామో.. సెప్టెంబర్ 17న కూడా అదే వ్యూహం అమలుచేయాలనేది టీఆర్ఎస్ ఆలోచన.

సెప్టెంబర్ 17కు  రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ఎన్నికల ప్రచారం మొదలై పోయినట్టుంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని  ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పై  రాజకీయంగా  పైచేయి సాధించేందుకు బీజేపీ ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవానికి  పూనుకుంది.

భారతదేశంలో హైదరాబాద్ రాచరిక రాష్ట్రం విలీనం కావడానికి కొన్ని నెలల ముందు జరిగిన హింసతో ఈ విమోచన దినం ముడిపడి ఉంది. అసలు హైదరాబాద్  రాష్ట్రం ఇండియాలో విలీనమయ్యాక సెప్టెంబర్ 17  ఆ తర్వాత ఉనికిలో లేదు. చరిత్రకారుడు మహ్మద్ నూరుద్దీన్ ఖాన్ ప్రకారం, MIM అధ్యక్షుడు కాసిం రజ్వీ, ఇతర సీనియర్ నాయకులు పాకిస్తాన్‌కు వెళ్లే ముందు, వారు పార్టీ పగ్గాలను అసదుద్దీన్ తాత అబ్దుల్ వాహెద్ ఒవైసీకి అప్పగించారు.

అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా టీఆర్ఎస్ ఈ సందర్భాన్ని  పట్టించుకోలేదని, మిత్రపక్షమైన AIMIMని ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తెలంగాణ అధికార పార్టీ ఇన్నాళ్లూ ఆ రోజును పాటించలేదని BJP చెబుతోంది.

‘తెలంగాణ జాతీయ ఐక్యతా దినోత్సవం’ను ‘విమోచన దినం’గా జరుపుకోవాలని కేంద్రం యోచిస్తున్న కారణంగానే ‘తెలంగాణ జాతీయ ఐక్యతా దినోత్సవం’గా నిర్వహించాలని గత వారం టీఆర్‌ఎస్ తన ప్రణాళికలను ప్రకటించవలసి వచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ ఎంపీగా ఉన్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి సెప్టెంబర్ 3న పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌గా  లేఖ రాశారు. ఈ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విలీన దినం  75వ వార్షికోత్సవం సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు జరపాలని బీజేపీ నిర్ణయించింది.

అంతేకాదు గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలు జిల్లాలు ఉండడంతో విమోచన దినోత్సవాల్లో వారిని కూడా భాగస్వాములను చేస్తారు. ఈ సభకు హాజరుకావాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైలకు కూడా  లేఖలు పంపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉత్సవాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ చేయడం, నాడు తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాలు, పోరు జరిగిన కేంద్రాలను స్మరణకు తెచ్చుకోవడం, ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలన్న“కేంద్రం ప్రకటన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఏఐఎంఐఎంలు కూడా దీన్ని గుర్తించాల్సి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని ఎన్నో ఏళ్లుగా బీజేపీ డిమాండ్ చేస్తోంది.

కేంద్రం మాదిరిగా కాకుండా, రాష్ట్రం విడిగా సెప్టెంబర్ 17 ను భారతదేశంతో తెలంగాణా ఏకీకరణ దినంగా జరుపుకుంటుంది. ఒవైసీ కూడా దీనిని సమర్ధించారు, ఈ సందర్భాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం పూర్వపు రాచరిక రాష్ట్రంలోని ప్రజలు భూస్వామ్య వ్యవస్థ,నిజాం నిరంకుశ పాలనను ప్రతిఘటించిన ధైర్యానికి ప్రతీక అని అన్నారు.

అధికార పక్షానికి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణలో ముస్లింల మద్దతును కేసీఆర్ పొందారు.   AIMIM పోటీ చేయని నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లతో లబ్ధి పొందారు. తెలంగాణ ఏర్పడక ముందు నుంచే కేసీఆర్… విద్యాసంస్థల నిర్మాణం, కళాశాలలు, యూనివర్సిటీలకు విరాళాలు ఇవ్వడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన తదితర అంశాల్లో నిజాంలు చేసిన మంచి పనులను గుర్తుచేసేవారు. “ఇది చాలా సద్భావనను సృష్టించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి టీఆర్‌ఎస్ దాని నుండి లబ్ది పొందింది. ఏకీకరణ లేదా విముక్తిని గుర్తించి, జరుపుకోవడం పార్టీ కొంత మద్దతును కోల్పోయేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకుల భావన.

చరిత్ర ఏం చెబుతోంది?
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. నిజాం పాలనలోని దక్కన ప్రాంతం మాత్రం 13 నెలల తర్వాత సెప్టెంబర్‌ 17న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఆపరేషన్‌ పోలో పేరుతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సైనిక చర్య ఫలితంగా నిజాం నవాబు.. భారత సమాఖ్యలో విలీనానికి అంగీకరించారు.

1940ల నాటికి, కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో ఒక బలమైన రైతు ఉద్యమం నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. త్వరలోనే పేద కౌలుదారులు, చిన్న సన్నకారు రైతుల్లో బలమైన పట్టును సంపాదించింది. స్వాతంత్ర్యం తరువాత హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలోకి ప్రవేశించడంపై చర్చలు ప్రారంభమైనప్పుడు, నిజాం, వారి జాగిర్ధారులు హైదరాబాద్‌ స్వత్రంత్ర్యరాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు మద్దతు ఇచ్చారు. కానీ రైతు నిరసనకారులతో సహా జనాభాలో ఎక్కువ మంది యూనియన్ ఆఫ్ ఇండియాలో చేరడానికి మొగ్గు చూపారు.

అప్పుడు నిజాం MIM నుండి పుట్టిన రజాకార్లు అనే పారామిలటరీ సంస్థను ఉపయోగించాడు. రజాకార్ మిలీషియా రైతు ఉద్యమాన్ని అణిచివేసింది. గ్రామాలను దోచుకుంది. ఆందోళనకారులని అనుమానించిన వారిని చంపేసింది. తద్వారా హైదరాబాద్‌ భారత యూనియన్‌లో చేరడానికి వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. 1948 ఆగస్టు 27న భైరానపల్లిలో భారత్‌లో విలీనం కావాలనే డిమాండ్‌ను అణిచివేసేందుకు రజాకార్లు 96 మంది గ్రామస్థులను హతమార్చారు.
సెప్టెంబర్ 17, 1948న, భారత సైన్యం ఆపరేషన్ పోలోలో భాగంగా ఆధునిక తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలతో కూడిన అప్పటి హైదరాబాద్‌సంస్థానంలోకి ప్రవేశించింది. వారంలోపే నిజాం, రజాకార్ దళం సైన్యానికి లొంగిపోయింది. కాసేపటి నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్ పోలో పూర్తయ్యింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles