33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ప్రకృతిలో ఫైవ్‌ స్టార్‌ పిక్నిక్ స్పాట్ .. బొంతపల్లి అభయారణ్యంలో ‘గ్లాంపింగ్ సైట్’ ఏర్పాటు!

హైదరాబాద్‌ : కొడైకెనాల్‌ లాంటి ప్రాంతాల్లో ఉండే గ్లాంపింగ్‌ విడిది కేంద్రాలు ఇప్పుడు హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతోంది. ప్రకృతివనంలో ఫైవ్‌స్టార్‌ వసతి కేంద్రాలను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పని ఒత్తిడితో సతమతమయ్యే టెకీలు రిలాక్స్‌ కోసం వీకెండ్‌ వస్తే దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంటే వీకెండ్‌ విడిది కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. నగర శివారులోని 16 ఫారెస్టు బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్న హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు విభాగం మాత్రం సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలోని అభయారణ్యాన్ని ప్రకృతి ప్రేమికులకు విడిది చేసేందుకు వీలుగా రూపకల్పన చేస్తోంది.

డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో రూ.15 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 15 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టును ‘లైసెన్స్ టు ఆపరేట్’ ప్రాతిపదికన ప్రతిపాదించారు.

క్లబ్ అడ్వెంచర్, లగ్జరీని ఇష్టపడే వారికి ఉద్దేశించిన ఈ సదుపాయం ఔటర్ రింగ్ రోడ్ నుండి 10 కి.మీ, నగరం యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ సేదదీరేందుకు వీలుగా 25 విలాసవంతమైన గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు.  ఒక్కో గుడారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో త్రీ స్టార్ అంతకుమించి సదుపాయాలతో ఉంటుంది.

“పర్యాటక మంత్రిత్వ శాఖ సూచించిన మార్గదర్శకాల ప్రకారం గ్లాంపింగ్ సైట్ ప్రమాణాలు త్రీ-స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి సమానంగా ఉంటాయి” అని HMDA అధికారి ఒకరు తెలిపారు, క్యాంపర్లు లేదా ‘గ్లాపర్లు’ ట్రెక్కింగ్, సఫారీ మార్గాలను ఆస్వాదించడమే కాకుండా ఆనందించవచ్చు. ప్రత్యేకమైన పక్షులను చూసేందు వీలు వ్యూ పాయింట్లను ఏర్పాటు చేస్తారు.

“పర్యావరణ వ్యవస్థకు ఎటువంటి భంగం కలగకుండా చూసుకోవడం ద్వారా సాహస క్రీడలు ట్రెక్కింగ్, సఫారీ లాంటివి నిర్వహిస్తారు.  ఈ అభివృద్ధి  కార్యకలాపాలు ప్రకృతికి ఎలాంటి హాని కలిగించవు. ఒక్క చెట్టు కూడా తొలగించరు. 53 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం అనుమతించబడదు ”అని హెచ్‌ఎండిఎ అధికారి ఒకరు తెలిపారు.

మొత్తంగా ప్రకృతి ప్రేమికులు సేద తీరేందుకు వీలుగా హెచ్ఎండీఏ వీటిని రూపకల్పన చేస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య, కొండలు, కోనల మధ్య గ్లాంపింగ్‌ సైట్‌ ఏర్పాటు చేస్తే టెంట్‌లో నుంచి సందర్శకులు కనుచూపు మేరలో అడవిని చూసేందుకు అవకాశముంటుంది.  తెలుగు రాష్ట్రాల్లో గ్లాంపింగ్‌ సైట్‌ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. మంత్రి కేటీఆర్‌, ఇతర ఉన్నతాధికారుల సూచన మేరకు ఇక్కడ గ్లాంపింగ్‌ సైట్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎండా, వాన, గాలి దుమారం వచ్చినా ఇబ్బందులు లేకుండా అధునాతనమైన గ్లాంపింగ్‌ టెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో ఉండే విధంగా అన్ని సదుపాయాలూ ఉండనున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles