23.7 C
Hyderabad
Monday, September 30, 2024

చారిత్రక ‘మీర్ ఆలం మండి’ పునరుద్ధరణకు ఏర్పాట్లు షురూ!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్‌లోని పురాతన, అత్యంత విశాలమైన మార్కెట్, పాత నగరంలోని మీర్ ఆలం మండి. అది తన చారిత్రక పునర్వైభవాన్ని కాపాడుకుంటూ… పునరుద్ధరణకు సిద్ధమైంది. 10.50 కోట్ల అంచనా వ్యయంతో కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA) చారిత్రాత్మక మార్కెట్‌ను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. సుమారు 200 ఏళ్ల క్రితం నాటి మార్కెట్‌ పునరుద్ధరణకు ఇప్పటికే బిడ్‌లను కూడా ఆహ్వానించారు, ఈ పనులకు ఏజెన్సీని ఎంపిక చేసిన తర్వాత 18 నెలల్లో పనులు పూర్తి చేయనున్నారు.

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ నిజాం కాలం నాటి మార్కెట్‌ను దాని పూర్వ వైభవానికి తెచ్చేందుకు, దాని చారిత్రక ప్రాముఖ్యతను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్, జనసాంద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందుగా మీర్ ఆలం మండి ఆర్చ్/కమాన్ పనులను చేపడతారు. పునరుద్ధణలో భాగంగా దీన్ని పటిష్టం చేస్తారు. ప్రస్తుతం, చారిత్రాత్మకమైన ఈ కమాన్‌ దాని అసలు రూపాన్నే కోల్పోయింది. కొన్ని ప్రదేశాలలో బీటలు వారింది.

ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రంగా ఉన్న ‘మీర్ ఆలం మండి’ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) మార్కెట్‌లో మరియు చుట్టుపక్కల వివిధ ప్రదేశాలను మరమ్మతు చేస్తుంది. కూరగాయల మార్కెట్ వద్ద మురుగునీటి కాలువను పునర్నిర్మించడం, ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయడం, రోడ్డును బాగుచేయడం, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడం వంటి ఇతర పనులు చేపట్టనున్నారు.

“మార్కెట్‌లో పారిశుద్ధ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీని కోసం వేర్వేరు ప్రదేశాలలో చెత్త డబ్బాలు ఏర్పాటు చేయనున్నారు. దుకాణదారులకు పారిశుధ్య పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తాము, ”అని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. MA&UD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మరియు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో స్టాల్ యజమానులతో పునరుద్ధరణ ప్రణాళిక, డిజైన్ కాన్సెప్ట్‌లు ఖరారు చేశారు.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ మార్కెట్ మొత్తం ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ స్థలంలో సుమారు 300 మంది వ్యాపారం చేసుకుంటున్నారు. మార్కెట్ పునరుద్ధరించబడిన తర్వాత, పరిశుభ్రమైన ఆ ప్రాంతంలో వ్యాపారం కూడా పెరుగుతుందని అధికారి తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles