31 C
Hyderabad
Tuesday, October 1, 2024

ప్రధాని మోదీకి కేటీఆర్ లేఖ… హిందీని బలవంతంగా రుద్దకండి!

హైదరాబాద్: ఐఐటీలు, సెంట్రల్ యూనివర్శిటీల వంటి సాంకేతిక, సాంకేతికేతర ఉన్నత విద్యాసంస్థల్లో బోధనా మాధ్యమం హిందీలో ఉండాలన్న పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసును తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సిఫార్సు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. ఆ సిఫార్సును వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు డిమాండ్ చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని అధికార భాషపై పార్లమెంటరీ ప్యానెల్ హిందీ మాట్లాడే రాష్ట్రాలు మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని సాంకేతిక మరియు సాంకేతికేతర ఉన్నత విద్యా సంస్థలలో హిందీని బోధనా మాధ్యమంగా చేయాలని సిఫార్సు చేసింది.  పార్లమెంటరీ కమిటీ రిక్రూట్‌మెంట్ పరీక్షలలో తప్పనిసరి ఆంగ్ల భాషా ప్రశ్నపత్రాన్ని తొలగించి, మరియు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హైకోర్టు ఉత్తర్వుల హిందీ అనువాదం కోసం ఏర్పాట్లతో సహా 100కి పైగా సిఫార్సులు చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ లేఖ రాశారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలపై పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు యొక్క ప్రతికూల ప్రభావాలు పడతాయన్నారు. ఈ నిర్ణయం భారతదేశంలోని వివిధ ప్రాంతాల మధ్య విభజనకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందీని పరోక్షంగా రుద్దడం వల్ల కోట్లాది మంది యువకులకు నష్టం కలిగిస్తోందని ఆయన అన్నారు. కేంద్ర ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షల్లో హిందీ, ఇంగ్లిష్‌లో ప్రశ్నలు రావడంతో ప్రాంతీయ భాషల్లో విద్యనభ్యసించే విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని ఆయన సూచించారు.

“సుమారు 20 సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు హిందీ మరియు ఇంగ్లీషులో పరీక్షలను నిర్వహిస్తాయి. UPSC ఈ రెండు భాషల్లో జాతీయ పోస్టుల కోసం 16 రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది. సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీల నుండి ఉద్యోగ ప్రకటనలు ఇప్పటికే చాలా తక్కువ. పరిమిత రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు ప్రాంతీయ భాషలలో విద్యను అభ్యసించిన విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నాయి. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది యువతకు  అన్యాయం’’ జరుగుతోందని ఆయన అన్నారు.

ఉద్యోగార్థుల ప్రయోజనాల కోసం ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ప్రధానిని అభ్యర్థించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు దేశ అభివృద్ధిని అడ్డుకుంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నందున, హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశంలో సామాజిక-ఆర్థిక విభజనలకు దారితీస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి.. కేటీఆర్ ట్వీట్

‘భారతదేశానికి జాతీయ భాషంటూ ఏదీలేదు. అన్ని భాషల్లాగే హిందీ కూడా ఒక అధికార భాష మాత్రమే. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తున్నారు. తద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దాం’ అని మంత్రి కేటీఆర్‌ ప్రథానికి లేఖ రాయక ముందు  ట్వీట్‌ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles