23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఒక్క వారంలోనే తెలంగాణలో రూ.1,850 కోట్ల పెట్టుబడులు!

హైదరాబాద్: భారతదేశంలో పెట్టుబడులకు తెలంగాణ ఏకైక గమ్యస్తానంగా మారింది. దీనికి కారణం… ఇక్కడ వ్యాపార అవకాశాలు మెండుగా ఉండటం, ప్రభుత్వ పారిశ్రామిక విధానం, రాజకీయ సుస్థిరత, ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులే. ఒక్క అక్టోబర్ 9 నుండి 16 వరకు కేవలం ఒక వారంలో మూడు కంపెనీల నుండి రూ. 1,850 కోట్ల విలువైన పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించింది. ఈ మూడు పెట్టుబడులు దాదాపు 4,500 మందికి ఉపాధిని సృష్టించే అవకాశం ఉంది. ఇవి లైఫ్ సైన్సెస్, ఎడిబుల్ ఆయిల్స్, జ్యువెలరీ మేకింగ్.

తెలంగాణలోని పెంజెర్లలో ఉన్న అమెరికా కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ను  హెటిరో గ్రూప్‌ చేజిక్కించుకుంది. ఈ ప్లాంట్‌ను హెటిరో రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది.  55.27 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ  ప్లాంట్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు, విస్తరించేందుకు తాజాగా  రూ. 600 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు హెటిరో మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వంశీకృష్ణ బండి సోమవారం తెలిపారు.  తద్వారా 2,000 కొత్త ఉద్యోగాలు కల్పించనున్నారు.

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి మరో సరికొత్త వ్యాక్సిన్ కేంద్రం రాబోతోంది. 700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ, యానిమల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. పశువులకు సహజంగా వచ్చే ఫూట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ ఇక్కడ తయారు కాబోతోంది. ఈ వ్యాక్సిన్ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 750మందికి ఉపాధి లభించే అవకాశముంది.

ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆనంద్ కుమార్ మాట్లాడుతూ… భారత టీకా రంగంలో IIL ఓ వినూత్న ముందడుగు అని చెప్పారు. రైతులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు తమ కంపెనీ టీకాలు ఎగుమతి అవుతున్నాయని చెప్పారాయన.

రెండు రోజుల తర్వాత అక్టోబర్ 12న తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం జెమిని ఎడిబుల్స్ సంస్థ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ సందర్భంగా ఆయిల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి మంత్రి కేటీఆర్‌ను కలిశారు.

తెలంగాణ ఇప్పటికే తన విధానాలతో రాష్ట్రంలో 2వ హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవానికి శ్రీకారం చుట్టింది. తాజాగా పసుపు విప్లవం (నూనె)కి శ్రీకారం చుట్టిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ప్రతిపాదిత యూనిట్ తెలంగాణ నుంచి ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రోజుకు 1,000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్‌. జెమిని ఎడిబుల్స్ సంస్థ పెట్టుబడి రాష్ట్రంలో వంటనూనెల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లోనూ తెలంగాణలో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తామని జెమిని ఎడిబుల్స్ సంస్థ ఎండీ ప్రదీప్ తెలిపారు. 1000 మందికి పైగా స్థానికులకు ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రభావం కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల క్రితం  రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

మలబార్ జెమ్స్ ఈ కంపెనీ నిర్మాణానికి  రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే తెలంగాణలో 17 రిటైల్ షోరూమ్స్‌ను ప్రారంభించింది. వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ షోరూమ్స్‌ను విస్తరించేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు మలబార్ జెమ్స్ అధికారులు పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మలబార్ గ్రూప్ పెట్టుబడిపై హర్షం వ్యక్తం చేశారు. రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టడంపై గ్రూప్ ను అభినందించారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సాకారాలను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులు, మలబార్ గ్రూప్ ఉద్యోగులు పాల్గొన్నారు.

‘‘తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న తయారీ యూనిట్ మా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. మహేశ్వరంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అని మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ ఎంపీ అన్నారు.

మొత్తంగా దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గథామంగా మారిందనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles