33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు… టీఎస్‌ఆర్‌టీసీ నిర్ణయం!

హైదరాబాద్: హైదరాబాదీలను ఆకట్టుకునేందుకు, ప్రజలను చేరువయ్యేందుకు టీఎస్‌ఆర్‌టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లండన్ తరహాలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్‌టీసీ యోచిస్తోంది. నగరంలోని పలు రూట్లలో 10 విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలనుకుంటోంది.  అయితే ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఖరీదు రూ.2.25 కోట్ల వరకు ఉండటం… అంత ఖర్చును భరించే ఆర్ధిక పరిస్థితి సంస్థకు లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన వాటిని ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో  టెండర్లు పిలవనున్నారు.  దీంతో దేశంలోనే ఇ-డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకునే మొదటి రోడ్డు రవాణా సంస్థగా అవతరించనుంది.

అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు టీఎస్‌ఆర్‌టీసీ టెండర్లలో పాల్గొననున్నాయి. టీఎస్‌ఆర్‌టీసీ అధికారుల ప్రకారం, బిడ్‌లో నెగ్గిన కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన సరఫరా చేయడానికి రవాణ సంస్థ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలి. కంపెనీకి ఛార్జీల ఆధారంగా కార్పొరేషన్ స్థిర అద్దె చెల్లిస్తుంది.

ఇటీవల ఆర్టీసీ అధికారులు ఈ కొత్త బస్సులను నడిపేందుకు సాధ్యమయ్యే మార్గాలను అధ్యయనం చేశారు. ప్రస్తుతానికి, పటాన్‌చెరు-కోటి, జీడిమెట్ల-సీబీఎస్ మరియు అఫ్జల్‌గంజ్-మెహదీపట్నం మూడు రూట్లలో ఇ-డబుల్ డెక్కర్ బస్సులను నడపవచ్చు.

గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రస్తావించడంతో ఆర్టీసీ సిద్ధపడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో సాధారణ డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కాంట్రాక్టు దక్కించుకుంది. కానీ నిధుల సమస్యతో దాన్ని రద్దు చేశారు. అయితే టీఎస్‌ఆర్‌టీసీ తన వ్యూహాన్ని మార్చుకుని ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అద్దెకు తీసుకోవాలని  నిర్ణయించింది.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles