24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

నిరుద్యోగులకు శుభవార్త… గ్రూప్-4 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన  నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 నోటిఫికేషన్‌తో పాటు.. పోలీసు ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.  ఇంటర్ అర్హతతో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. ఈ వివరాలను రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి టి.హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

‘‘ ఇచ్చిన వాగ్దానాలు, ఆశయాలను నెరవేర్చే నాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. అభ్యర్థులకు శుభాకాంక్షలు’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఫైనాన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో 1,862 వార్డు ఆఫీసర్లు, ఫైనాన్స్ విభాగాల్లో 18 జూనియర్ ఆడిటర్ల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

అదేవిధంగా వివిధ విభాగాల్లో మొత్తం 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్‌లో 44, పశుసంవర్ధక, మత్స్యశాఖలో రెండు, బీసీ సంక్షేమంలో 307, పౌర సరఫరాలలో 72, ఎనర్జీలో 2, పర్యావరణం, అటవీ విభాగంలో 23, ఫైనాన్స్‌లో 46, సాధారణ పరిపాలనలో ఐదు, ఆరోగ్యం, వైద్య విభాగంలో 338 పోస్టులు ఉన్నాయి.  ఉన్నత విద్యలో 742, హౌసింగ్‌లో 133, పరిశ్రమలు, వాణిజ్యంలో ఏడు, నీటిపారుదలలో 51, కార్మిక, ఉపాధిలో 128, మైనారిటీ సంక్షేమంలో 191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 601, పంచాయతీ రాజ్‌లో 1,245, ప్లానింగ్‌లో 2,0477 ఆదాయం, ఎస్సీ డెవలప్‌మెంట్‌లో 97, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 97, రవాణా, రోడ్లు, భవనాల్లో 20,  గిరిజన సంక్షేమంలో 221, స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖలలో 18 ఉన్నాయి.

ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ వస్తుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో అత్యంత పకడ్భందీగా నోటిఫికేషన్ ను రూపొందించే పనిలో టీఎస్పీఎస్సీ నిమగ్నమై ఉంది. ఎలాంటి సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నోటిఫికేషన్ విడుదలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పది శాతం రిజిర్వేషన్లు కల్పించిన తర్వాత వచ్చిన తొలి నోటిఫికేషన్ సైతం ఇదే కావడం గమనార్హం.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles