24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బొగ్గు గనుల వేలం రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం చేపడతాం… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) పరిధిలోని బొగ్గు గనులను వేలం వేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీని నష్టాల్లోకి నెట్టడం, ఉద్దేశ్యపూర్వకంగా ప్రైవేటీకరించడం కేంద్రం కుట్ర అని ఆయన అభివర్ణించారు.

కేంద్రం వేలాన్ని రద్దు చేసే వరకు ప్రజా ఉద్యమం చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.  పార్టీలకతీతంగా  ఈ అంశాన్ని ఎంపీలు పార్లమెంటులో కూడా లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు.

సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఇటీవల రామగుండం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, ప్రధాని చెప్పిన దానికి విరుద్ధంగా సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు కేంద్రం మొన్న లోక్‌సభలో ప్రకటించింది.

సింగరేణి కాలరీస్‌ను ప్రైవేటీకరించడం వల్ల రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం పడుతుందని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు ప్రతీకారపూరితమైనవని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే కుట్రగా ఆయన అభివర్ణించారు. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎస్‌సిసిఎల్‌ అగ్రగామిగా ఉందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) ఉన్న సింగరేణి మంచి లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

ఇదే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు మాత్రం నామినేషన్ పద్ధతిన గుజరాత్‌లో భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుజరాత్ మాదిరే తెలంగాణలోని సింగరేణికి సైతం బొగ్గు గనులను ఎందుకు కేటాయించరని ఆయన ప్రశ్నించారు.

సింగరేణి కాలరీస్‌కు బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం, కార్మికులు, ఎస్‌సిసిఎల్‌ యాజమాన్యం పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్‌సిసిఎల్‌ను ప్రైవేటీకరించే కుట్రపై ఉద్యోగుల పోరాటానికి టిఆర్‌ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles