25.2 C
Hyderabad
Monday, September 30, 2024

మన ఊరు-మన బడి… సర్కారు బడులకు మహర్దశ!

హైదరాబాద్: రాష్ట్ర  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పథకం ద్వారా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో నిధులు, నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని తెచ్చింది. కార్పొరేట్ సూళ్లకు దీటుగా వాటిని తీర్చిదిద్దింది. ఈ  పథకం ద్వారా విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడం లక్ష్యంగా పెట్టుకున్నది.

ఒక్కసారి మనం హైదరాబాద్, ఆలియాలోని ప్రభుత్వ పాఠశాలను గమనిస్తే…  విద్యార్థుల కోసం డ్యూయల్ డెస్క్‌లు, రంగురంగుల పెయింటింగ్స్‌తో కూడిన ఇంపైన తరగతి గదులు, డైనింగ్ హాల్ మొదలైన వాటితో సహా సరికొత్త ఫర్నిచర్‌ను చూస్తుంటే, చాలామంది దీనిని కార్పొరేట్ లేదా అంతర్జాతీయ పాఠశాల అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది ‘మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి’ కార్యక్రమం కింద పునరుద్ధరించిన ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్.

వనపర్తిలోని జెడ్‌పి హైస్కూల్ (బాలుర)లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఈ ఏడాది లాంఛనంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం ఇది.

మన ఊరు మన బడి పథకం కింద మొత్తం 26,072 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు దశలవారీగా పనులు చేపట్టారు.  12 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. అవి వరుసగా నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నీచర్, మొత్తం పాఠశాలలకు పెయింటింగ్,  గ్రీన్ సుద్ద బోర్డు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్‌లు, శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో కొత్త తరగతి గదులు,  ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు, డిజిటల్ విద్యను అమలు చేయడం వంటి అంశాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. ఈ పాఠశాలల్లో 97.8 శాతం పనులకు పరిపాలన అనుమతులు లభించగా, 82.41 శాతం పాఠశాలల్లో పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వ,  స్థానిక సంస్థల పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి అనువర్తన ఆధారిత జియో-హాజరు సాంకేతికతను ప్రవేశపెట్టింది.

మన ఊరు-మన బడి పథకం ద్వారా పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నది. అయితే గతంలో మాదిరిగా సాధారణ విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తే ప్రతి నెలా కరంట్‌ బిల్లులు చెల్లించడం స్కూళ్లకు భారంగా మారుతుంది. ఇందుకు పా ఠశాలల్లో ప్రభుత్వ నిధులతోనే సోలార్‌ విద్యుత్‌ను ఏర్పా టు చేయాలని నిర్ణయించింది. దీని కోసం మొదటి విడతగా రాష్ట్రంలో 1580 పాఠశాలలను ఎంపిక చేసారు. వీటి నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధనీయ ఇంధన వన రుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (టీఎస్‌రెడ్కో)కు అప్పగించింది.

మొత్తంగా పాఠశాల విద్యను విద్యార్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం ఈ పథకం ద్వారా రంగం సిద్ధం చేసింది. దీనికోసమే మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకాన్ని ఆవిష్కరించింది.
ఇందుకోసం ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.7,289 కోట్లను కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపులతో స్కూళ్ల ఆధునీకరణ, మౌలిక సదుపాయల కల్పన చేపట్టనుంది. తొలి దశలో భాగంగా 9 వేలకు పైగా స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,497 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా పాఠశాలల స్థాయిలలో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. పూర్వ విద్యార్థులను కూడా దీనిలో భాగస్వామ్యం చేసి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోంది.  గ్రామాలలోని పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేపట్టాలని, అందుకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఈ పథకం కింద ప్రభుత్వం కల్పిస్తుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles