23.7 C
Hyderabad
Monday, September 30, 2024

రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ‘కోదాడ’ పట్టణ పీఎస్!

హైదరాబాద్: ఒకప్పుడు పోలీస్‌స్టేషన్‌ అంటేనే సాధారణంగా జనాలకు ఏదో తెలియని భయం. ఠాణా మెట్లు ఎక్కాలంటేనే సన్నటి ఒణుకు పుడుతుంది. అయితే  రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ఎనిమిదేళ్లలో పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు అమలు చేశారు. దీంతో ప్రజల్లో పోలీస్ స్టేషన్ అంటే భయం మెల్లగా దూరమైంది. మరోవంక ఫంక్షనల్‌ వర్టికల్‌ విధానంలో భాగంగా స్టేషన్‌లో 17 విభాగాలుగా పని విభజన చేసి సిబ్బంది మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ పోలీస్‌స్టేషన్ల ఎంపికలో ఈ ఫంక్షనల్‌ వర్టికల్ విధానాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఏడు ఫంక్షనల్‌ వర్టికల్‌  ఆధారంగా రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. పోలీస్ స్టేషన్ 5S ఫంక్షనల్ వర్టికల్, ఇన్వెస్టిగేషన్, సమన్లు, కోర్ట్ మానిటరింగ్, సైబర్ క్రైమ్ మానిటరింగ్, పోలీస్ హెచ్‌ఆర్‌ఎంఎస్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రాన్స్‌పోర్టేషన్ నిర్వహణలో ఇది ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది.

రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దిన కోదాడ పట్టణ పోలీసులను, సూర్యాపేట జిల్లా పోలీసులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభినందించారు.

ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదుదారుడు స్టేషన్‌కు రాగానే సాదరంగా ఆహ్వానించి సమస్యను సావధానంగా వినేందుకు ఠాణాలో రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. ఎఫ్​ఐఆర్​ నమోదుకు అవసరమైన ప్రతి విషయాన్ని ఫిర్యాదులో రాసేలా రిసెప్షన్ కౌంటర్‌లో కూర్చున్న అధికారి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత కేసు నమోదు, దర్యాప్తు, కోర్టులో విచారణ, నిందితుడికి శిక్ష పడేలా చూడటం, స్టేషన్ రైటర్లు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, దొంగతనాల నిఘా, ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, ఫ్రెండ్లీ పోలిసింగ్ ఇలా 17 ఫంక్షనల్ వర్టికల్స్‌ను ఏర్పాటుచేశారు. వాటికి అనుగుణంగా ప్రతి పోలీస్‌ అధికారి పనిచేయాల్సి ఉంటుంది.

జిల్లా ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏడు వర్టికల్ ఫంక్షనింగ్ అమలులో సూర్యాపేట జిల్లా పోలీసులను అగ్రస్థానంలో నిలిపేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులపై జిల్లా పోలీసులు సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. జిల్లా పోలీసుల టీమ్ వర్క్ కూడా సమర్థవంతమైన పోలీసింగ్‌ను నిర్ధారించడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles