23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘నాంపల్లి ఎగ్జిబిషన్‌’కు వేళయింది… జనవరి 1నుంచి ‘నుమాయిష్’!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వేళయింది.  ‘నుమాయిష్’గా పేరొందిన  అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన  జనవరి 1న ప్రారంభం కానుంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.  ఈ ఏడాది ఎగ్జిబిషన్‌ నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉండడంతో స్టాల్స్‌ పొందేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.

జమ్ము&కాశ్మీర్, గుజరాత్, లక్నో, ఢిల్లీ, రాజస్థాన్ నుండి వచ్చిన వ్యాపారులు క్రితంసారి కన్నా… ఈ సంవత్సరం మంచి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు.  దేశంలో జరిగే అతి పెద్ద ఎగ్జిబిషన్లలో ఇది ఒకటి కావడంతో షాపింగ్ కోసం భారీగా జనం ఇక్కడికి వస్తారు. లోకల్, నేషనల్ బ్రాండెడ్ వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. సిటీ జనంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎగ్జిబిషన్ సందర్శిస్తారని భావిస్తున్నారు.

ఎగ్జిబిషన్ కు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని సొసైటీ నిర్వాహకులు వెల్లడించారు. ఒక స్టాల్ కు మరో స్టాల్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేలా రోడ్డు వెడల్పు చేస్తున్నామన్నారు. స్టాల్స్ కోసం ఇప్పటికే 2వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో నుంచి 1700 స్టాల్స్ ను ఎంపిక చేశారు. ఈసారి నుమాయిష్ కు 20 లక్షల మంది ప్రజలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

2019లో జరిగిన అగ్నిప్రమాదాలు, 2020లో CAA వ్యతిరేక నిరసనలు, కోవిడ్-19 కారణంగా 2021లో నుమాయిష్ రద్దు చేశారు. 2022లో షెడ్యూల్ ప్రకారం జరగకపోవడం వంటి వివిధ పరిణామాల కారణంగా వ్యాపారస్తులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ సంవత్సరం మంచి లాభాలు అందుకుంటామని వ్యాపారస్థులు అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా నుమాయిష్‌లోని కాశ్మీరీ ఫ్యాబ్రిక్స్ స్టాల్ యజమాని మహమ్మద్ అస్రార్ మాట్లాడుతూ “ఎగ్జిబిషన్‌ను సజావుగా నిర్వహిస్తామని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ మాకు హామీ ఇవ్వడంతో మేము నుమాయిష్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఎగ్జిబిషన్‌లో స్టాల్ ఏర్పాటుకు మేము లక్షలు వెచ్చించాము. ఇప్పుడు అంతా సేఫ్టీ ప్రోటోకాల్‌లను పాటించాలా వద్దా అనే దానిపై నుమాయిష్‌ని సందర్శించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన అన్నారు.

మరో వ్యాపారి లక్నోకు చెందిన అఖ్లాక్ అన్సారి మాట్లాడుతూ… కొత్త వేరియంట్‌కు భయపడకుండా షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాను. కస్టమర్లు కూడా స్టాల్స్ నుండి షాపింగ్ చేయడానికి ఆసక్తిని కనబరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నుమాయిష్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. స్టాల్స్‌ కేటాయింపు, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్టాల్స్‌ పొందేందుకు వివిధ రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 1వ తేదీ నాటికి 80 శాతం స్టాల్స్‌ అందుబాటులోకి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు  తెలిపారు. అంతేకాదు కొత్త వేరియంట్ BF7పై ప్రజల్లో భయాందోళనలు సృష్టించాల్సిన అవసరం లేదని, కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించి షెడ్యూల్ ప్రకారం నుమాయిష్ ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ మార్గం చెప్పారు.

అప్పట్లో హైదరాబాద్‌ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిధుల సేకరణ కోసం పబ్లిక్‌ గార్డెన్స్‌లో స్థానిక ఉత్పత్తులతో 85 ఏళ్ల క్రితం ప్రారంభమైన నుమాయిష్‌.. నేడు దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా ఆవతరించింది. నాడు కొంత మంది విద్యావంతుల ఆలోచన నేడు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles