23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

బడ్జెట్‌లో చేనేత రంగానికి నిధులివ్వండి… కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ!

హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో… రాష్ట్ర చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు తగినన్ని నిధులు కేటాయించాలని చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం పట్టించుకోలేదని, రానున్న బడ్జెట్‌లోనైనా టెక్స్‌టైల్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రి కేటీఆర్‌ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.

ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్ అని,  వచ్చే ఏడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే ఉంటుందని గుర్తుచేసిన కేటీఆర్‌, ఇప్పటికైనా తెలంగాణ పట్ల కేంద్రం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు., భారీ నిధులు కేటాయించి నేత కార్మికులు, జౌళి రంగంపై ప్రధాని మోదీ తన నిబద్ధతను నిరూపించుకోవాలని లేఖలో కోరారు.

చేనేత రంగం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోందని, ఇది భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ అని కేటీఆర్ అన్నారు. ఈ పార్క్ ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని ఆయన అన్నారు.

సుమారు రూ.1,600 కోట్లతో చేపట్టిన ఈ భారీ టెక్స్‌టైల్‌ పార్కుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. ఇందులో మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్‌లో కనీసం రూ.900 కోట్లు కేటాయించాలి’ అని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.

25 వేలకు పైగా పవర్‌లూమ్ మిషన్లు ఉన్న సిరిసిల్లలోని పవర్‌లూమ్ సెక్టార్‌ను మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌గా గుర్తించి రూ.100 కోట్లు కేటాయించినట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకం, ఇతర కార్యక్రమాలు అయిన వాల్యూ చైన్ పటిష్టత, సిరిసిల్లలో పవర్ లూమ్‌ల ఆధునీకరణ, మార్కెట్ మెరుగుదల, స్కిల్ డెవలప్‌మెంట్, కెపాసిటీ బిల్డింగ్ కోసం రూ.990 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పర్యవేక్షణ, దాని కోసం బడ్జెట్‌లో అధిక వాటాను ప్రకటించాలని మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 40 వేల మందికి పైగా చేనేత కార్మికులు ఉన్నారని, యాదాద్రి భువనగిరి, గద్వాల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌లో ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారని, రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మంజూరు చేయాలని రామారావు కేంద్రాన్ని కోరారు. గుండ్లపోచంపల్లి, యాదాద్రి భువనగిరిలో ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ బడ్జెట్‌లో జాతీయ టెక్స్‌టైల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హ్యాండ్లూమ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్‌ను ప్రకటించాలని, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్స్ క్లస్టర్‌లను మంజూరు చేయాలని  మంత్రి కోరారు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత, పవర్‌లూమ్స్, హస్తకళల బోర్డులను పునరుద్ధరించాలని, నేత కార్మికులకు బీమా, పొదుపు పథకాలను మళ్లీ ప్రవేశపెట్టాలని రామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే కేంద్రం కూడా నూలు సబ్సిడీని 50 శాతానికి పెంచాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవటం, పాలసీ ప్రోత్సాహకాలు లేకపోవడం వంటి కారణాల వల్లే టెక్స్‌టైల్‌ రంగంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి చిన్న దేశాలకంటే మనదేశం వెనుకబడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘అంతర్జాతీయంగా గొప్ప పేరున్న కిటెక్స్‌ సంస్థ దేశాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధపడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులాంటి మౌలిక వసతులు, పాలసీ ప్రోత్సాహకాల వల్ల చివరిక్షణంలో దేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది.

మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించకుంటే కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’ కేవలం నినాదంగా ఉండిపోతుందని చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ తమ లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ టెక్స్‌టైల్ కంపెనీలను మన దేశానికి ఆకర్షించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

మార్కెటింగ్‌ ఆధారిత ఇన్సెంటివ్‌ పథకాన్ని సరళతరం చేసి నేతన్నలకు అండగా నిలబడేలా బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలి. నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచే బీమా యోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles