28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఏపీలో అడుగుపెట్టిన బీఆర్ఎస్… పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్!

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెల్లగా‌ అడుగులు వేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పోటీకి సిద్ధమయ్యారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రవేశించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నిన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఏపీ నుంచి మహామహులు బీఆర్‌‌ఎస్‌‌లోకి వస్తామని చెప్తున్నారని, తనకు ఊహకందని స్థాయిలో పార్టీలో చేరుతామని వేలాది ఫోన్లు చేస్తున్నారని పార్టీ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌ అన్నారు. తాము చీకట్లో బాణం వేయడంలేదని, ఒక లక్ష్యంతో వెళ్తున్నామని, టార్గెట్‌‌ రీచ్‌‌ అవుతామని చెప్పారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌‌లో ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. మాజీ ఐఏఎస్‌‌ అధికారి తోట చంద్రశేఖర్‌‌ను పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్​ నియమించారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్‌‌ బాబు సహా పలువురు నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడుతూ.. ‘‘ఏపీలో సిట్టింగ్‌‌లు కూడా వస్తామంటున్నారు. మీరు సిట్టింగ్‌‌లే కదా ఎందుకు వస్తారని అడిగితే.. సిట్టింగే అయినా ఇక్కడ (ఏపీలో) ఫిట్టింగ్‌‌ సరిగా లేదని అంటున్నారు.. మీరు చూస్తూ ఉండండి.. నా ఆఫీస్‌‌ కన్నా ఏపీ ఆఫీస్‌‌ బిజీగా ఉంటది.. సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్​ఎస్​లో భారీగా చేరికలుంటాయి. నాకు ఇప్పుడు ఏపీలో వజ్రాల్లాంటి నేతలు దొరికారు. తమ పీఠాల కిందికి నీళ్లెక్కడ వస్తాయోనని చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారు. వాటిని పట్టించుకోవద్దు. ఎంతో మంది సన్నాసుల కన్నా తోట చంద్రశేఖర్ లాంటి నేతలు బెటర్. వీళ్లకు అవకాశాలు వస్తే ఎంతో చేస్తారు​’’ అని అన్నారు. ఒక ఊరు కోసమో.. రాష్ట్రం కోసమో బీఆర్​ఎస్​ పుట్టింది కాదని, దేశం కోసం.. కేంద్రాన్ని ప్రశ్నించడానికే పుట్టిందని చెప్పారు. బీఆర్‌‌ఎస్‌‌లో చేరిన వాళ్లకు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి దక్కినంత గౌరవం దక్కుతుందని సీఎం అన్నారు.

దేశంలో బీఆర్‌‌ఎస్‌‌కు ప్రజలు అధికారం ఇస్తే రెండేండ్లలోనే వెలుగు జిలుగుల భారత్‌‌ అవతరిస్తుందని కేసీఆర్​ చెప్పారు. ప్రతి రైతుకు ఉచిత కరెంట్‌‌ ఇచ్చినా ఖర్చయ్యేది రూ.1.40 లక్షల కోట్లేనని అన్నారు. దేశంలో ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇస్తామని తెలిపారు. తెలంగాణలో దళితబంధుతో దళితబిడ్డలు దర్జాగా కాలుమీద కాలు వేసుకొని బతుకుతున్నారని ఆయన అన్నారు. లాభాల్లో ఉన్న ఎల్‌‌ఐసీని మోడీ ప్రభుత్వం ఎందుకు అమ్ముతున్నదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ఇప్పటి ప్రభుత్వం అమ్మినా బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకొని పబ్లిక్‌‌ సెక్టార్‌‌లోనే పెడతామన్నారు. కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణను అడ్డుకోవడానికే బీఆర్ఎస్‌‌ పుట్టిందని చెప్పారు. మహారాష్ట్ర, పంజాబ్‌‌, ఒడిశా, హర్యానా తదితర రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు రెడీ అయ్యాయని, సంక్రాంతి తర్వాత పార్టీ పరుగులు పెట్టనుందని కేసీఆర్ అన్నారు. ఒక్క ఏపీ, తెలంగాణలో మార్పుతోనే వచ్చేదేమి లేదని.. దేశాన్ని ఉజ్వలంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. కొందరికి పాలిటిక్స్‌‌ అంటే గేమ్‌‌ అని, అదే తమకు ఒక్క టాస్క్‌‌ అని కేసీఆర్​ అన్నారు. ఫ్రంట్‌‌లు, టెంట్‌‌లు పెట్టి 500 ఎంపీలు గెలిచినా చేసేది ఏముంటుందని ప్రశ్నించారు. లోక్‌‌సభలో బిల్లు పాసయితే రాజ్యసభలో ఆగుతుందని అన్నారు. ప్రగతికి ఆటంకం కలిగించే ఇలాంటి విషయాల్లో సంస్కరణలకు అవసరమయ్యే మార్పులు చేసుకోవాలని తెలిపారు. దేశంలోని 6.64 లక్షల గ్రామాలు, 1,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో నాయకులు ‘కారు‘ ఎక్కడానికి ఉత్సాహం చూపిస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles