23.7 C
Hyderabad
Monday, September 30, 2024

తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి త్వరలో సిద్ధం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్‌లో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

ఉత్తర తెలంగాణలోని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఈ  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. వరంగల్  హెల్త్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1200 కోట్లతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. పాత సెంట్రల్ జైలు ఆవరణలో అభివృద్ధి చేస్తున్న 56 ఎకరాల క్యాంపస్‌లో 24 అంతస్తుల్లో దీన్ని  నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫైర్ సేఫ్టీ, జైళ్ల శాఖలు ఈ ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేశాయి. 24 అంతస్తులలో, 16 అంతస్తులు ఆసుపత్రి సేవలకు ఉపయోగిస్తారు. మిగిలినవి అకడమిక్, ఇతర ప్రయోజనాల కోసం వాడతారు.

వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వి. ప్రశాంత్‌రెడ్డి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులకు అనుగుణంగా వైద్యులు ఇతర వైద్య సిబ్బందిని కూడా నియమించడానికి ప్రయత్నాలు వేగవంతం చేశారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జూన్ 21, 2021న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.

పురోగతిలో ఉన్న ఈ ఆస్పత్రి నిర్మాణ పనుల చిత్రాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2,000 పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆతిథ్యం ఇవ్వడానికి వరంగల్ నగరం సిద్ధమవుతోంది.

24 అంతస్తుల ఈ ఆసుపత్రి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక అని, దీని నిర్మాణం శరవేగంగా జరుగుతోందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మొత్తం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేదని మంత్రి చెప్పారు.

“కొంతమంది బీజేపీ ట్రోలర్లు సామాజిక మాధ్యమాల్లో వెర్రి వాదనలు చేసే ముందు, ఈ ఆసుపత్రికి భారత ప్రభుత్వ సహకారం శూన్యం అని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని కేటీఆర్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles