23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

కొత్త చరిత్రను లిఖిస్తాం… ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పిలుపు!

హైదరాబాద్: దేశాన్ని రక్షించడానికి బిజెపికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు బంధు, దళిత బంధు, తాగునీరు, ఇంటింటికీ విద్యుత్ సరఫరా వంటి పథకాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అభివృద్ధిని  అమలు చేస్తామని  వాగ్దానం చేశారు.  దేశం కోసం పార్టీ విజన్‌ను ఖమ్మం బహిరంగ సభలో ఆయన ఆవిష్కరించారు.

ప్రైవేటీకరణ బిజెపి విధానమని, జాతీయీకరణ బిఆర్‌ఎస్ ఎజెండా అని కూడా కేసీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి పూర్వ వ్యవస్థను పునరుద్ధరిస్తామని పేర్కొన్న సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  150 మంది ప్రముఖ రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ద్వారా బీఆర్‌ఎస్ పూర్తి ముసాయిదా విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. అవన్నీ త్వరలోనే దేశం ముందు పెడతాం. చర్చిస్తాం. సీపీఐ, సీపీఎం వంటి క్రియాశీల, ప్రగతిశీల పార్టీలతో దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తుంది. బ్రహ్మాండంగా ముందుకెళతాం. న్యాయం, ధర్మం ఎప్పుడూ గెలిచి తీరుతుంది. అంతిమ విజయం మనదే అని కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

బుధవారం ఖమ్మంలో జరిగిన పార్టీ జాతీయ ఆవిర్భావ బహిరంగ సభలో, జాతి పురోగతికి సమృద్ధిగా ఉన్న సహజ వనరులను ఉపయోగించడంలో బిజెపి, కాంగ్రెస్‌ల అసమర్థతపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. “ఈ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటే, భారతదేశం పురోగతి సాధించడానికి ప్రపంచ బ్యాంకు, అమెరికా లేదా మరే ఇతర దేశం ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. ఇవాళ దేశంలోని పెద్దలందరూ చెప్పారు. బీజేపీ తమ వైఫల్యాలు, అసమర్థత, చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మత విద్వేషపు మంటలు రేపుతున్నారు. మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్వధర్మ సమభావనే, సకల జనుల సంక్షేమమే భారత సాంస్కృతిక పరంపర అని కేసీఆర్ అన్నారు.

ఎన్నికలు, రాజకీయాల ప్రక్రియలో భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి బీఆర్ఎస్ ఏర్పడిందని ఆయన అన్నారు. 41 శాతం సాగు భూమి, దాదాపు 70,000 టీఎంసీల నీరు,  4.1 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం, 139 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహార ఉత్పత్తిదారుగా అవతరించేందుకు మనకు అన్ని వనరులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారతదేశంలో ప్రజలకు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం లేదు’’ అని ఆయన అన్నారు.

రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని, కేంద్రంలోని ప్రభుత్వాలు సాధారణ అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యాయో చెప్పాలని సీఎం చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటై దాదాపు 20 ఏళ్లు గడుస్తున్నా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇంకా ఖరారు కాలేదని ఆయన గుర్తు చేశారు. ” పాలనలో అసమర్థతలను ప్రశ్నించడానికే బీఆర్ఎస్ పుట్టింది. మనం అభివృద్ధి చెందాలా లేక అసమర్థంగా ఉండాలా అని ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తరహాలో దేశ ప్రగతి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు.

కేంద్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు మిషన్ భగీరథ వంటి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రశేఖర్ రావు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ‘జోక్ ఇన్ ఇండియా’గా మారిందని, ప్రతి వీధిలో చైనా బజార్లు వెలిశాయని ఆయన అన్నారు.

ఎల్‌ఐసీ పెట్టుబడుల ఉపసంహరణను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను విక్రయించడాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోందని, నష్టాల సామాజికీకరణ, లాభాల ప్రైవేటీకరణ, పెరిగిన ధరలు, పన్నులతో ప్రజలపై భారం మోపడమే బీజేపీ విధానమని అన్నారు. “మోదీ జీ, మీ విధానం ప్రైవేటీకరణ. కానీ మా విధానం జాతీయీకరణ. మీరు LICని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపిస్తే ఎల్‌ఐసీని కేంద్రం స్వాధీనం చేసుకుని జాతీయం చేసేలా చూస్తాం’’ అని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ దళితబంధు పథకాన్ని.. సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున దేశమంతా అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తున్నది. దీన్ని చేయడం కేంద్రానికి చేతకాకపోతే తప్పుకోండి. మేం చేసి చూపిస్తాం అని కేసీఆర్ సవాలు విసిరారు. చట్టసభలలో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. ‘ఆఖరి విజయం మనదే అవుతుంది. న్యాయం, ధర్మం ఎప్పుడూ గెలుస్తాయి” అని అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles