23.7 C
Hyderabad
Monday, September 30, 2024

అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు… డీజీపీ అంజనీకుమార్!

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు (WHD) ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ తెలిపారు. మహిళా భద్రతా విభాగానికి వచ్చిన ఫిర్యాదులపై పిటిషనర్ల ఫీడ్‌బ్యాక్ పొందడానికి 24X7 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళా భద్రతపై అదనపు డీజీపీ శిఖా గోయెల్, డీఐజీ సుమతిలతో డీజీపీ నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

మహిళలు, పిల్లల భద్రతలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో ఉమెన్‌ సేఫ్టీవింగ్‌ పనితీరు అద్భుతంగా ఉందని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను తక్షణమే నియంత్రించేందుకు యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ నొక్కి చెప్పారు. రాష్ట్రంలోని 750 పోలీస్‌స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు ఉన్నాయని, త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్‌లలో ఇలాంటి హెల్ప్ డెస్క్‌లు వస్తాయని డీజీపీ తెలిపారు.

మహిళా భద్రతపై స్థానిక యంత్రాంగాన్ని ఒకే టెక్ ప్లాట్‌ఫామ్‌ కిందకు తీసుకురావడం ద్వారా మహిళలపై నేరాలను అరికట్టవచ్చని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. 12 యూనిట్లలో భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే అన్ని యూనిట్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు. గృహహింసకు గురైన మహిళలకు కౌన్సెలింగ్‌ తీసుకునేందుకు మహిళా సాధికారత కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నారు.

భరోసా కేంద్రాల ద్వారా లైంగిక నేరాల కేసులపై విచారణ పర్యవేక్షణ కారణంగా 2022లో నమోదైన లైంగికదాడి కేసుల్లో 22 కేసులకు సంబంధించి నేరస్తులను జైలుకు పంపామన్నారు. లైంగికదాడి కేసుల్లో విచారణలు వేగవంతం కావాలని, నేరం నిరూపించి శిక్షలు విధించేందుకు మరింత ఉత్సాహంగా సిబ్బంది పనిచేయాలని డీజీపీ కోరారు.

డీజీపీ ఇంకా మాట్లాడుతూ…  ఫిర్యాదుల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించాలని అధికారులను కోరారు. తెలంగాణవ్యాప్తంగా షీటీమ్స్‌ అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. 2022లో 6,157 ఫిర్యాదులు స్వీకరించగా వాటిల్లో 521 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, 13,471 అవగాహన శిబిరాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. షీటీమ్స్‌ వర్టికల్స్‌ను మరింత బలోపేతం చేసి.. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విషయంలో బాగా పనిచేసే అధికారులను గుర్తించి రివార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles