24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రైతులపై పన్ను విధించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది… మంత్రి కేటీఆర్!

నారాయణపేట: దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం… ఆ పని చేయకపోగా కొత్తగా రైతులపై పన్నులు వేసే ఆలోచన చేస్తోందని మంత్రి కేటీఆర్ బీజేపీపై మండిపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో రైతు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

‘ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారు వివేక్‌ దేబ్‌రాయ్‌ ఒక పేపర్‌లో ఆర్టికల్‌ రాస్తూ రైతులపై ఆదాయ పన్ను వేయాలని సూచించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటదా? రైతుల ఆదాయాన్ని పెంచేది పోయి, పన్ను వసూలు చేయాలనే దుర్మార్గమైన ఆలోచన కేంద్రం చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, పండిన పంటలకు సరైన ధర లేకపోవడంపై రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, అయితే రైతుల ఆదాయం పెంచకపోగా వారిపై ఆదాయపు పన్ను విధించేందుకు సిద్ధమైంది. ఇలా చేయడం ఏమేరకు సబబు అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

నిన్న నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.196 కోట్లతో నిర్మించనున్న నూతన కలెక్టరేట్‌, ఎస్పీ భవన సముదాయాలతోపాటు పలు అభివృద్ధి పనులకు మంత్రులు మహమూద్‌ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతు బంధు, రైతు బీమా తదితర కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. దీనికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం రైతు వెన్ను విరిచింది. ప్రధాని మోదీ కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, అది అబద్ధమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. రూ. 12 లక్షల కోట్లతో దేశంలోని రైతులకు దాదాపు 10 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను అందించవచ్చని మంత్రి అన్నారు.

అభివృద్ధి ప‌నుల‌తో తెలంగాణ ప్రజలు నాగ‌రికం వైపు పోతుంటే బీజేపీ నాయ‌కులు మాత్రం అనాగ‌రికం వైపు వెళ్తున్నార‌ని కేటీఆర్ ఆరోపించారు. కులాలు, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. బిజెపి తప్పుడు  హామీలు విని మోసపోవద్దని ప్రజలను కోరారు. విజ్ఞతతో ఆలోచించి 2024లో కేంద్రంలో రైతు అనుకూల ప్రభుత్వానికి మద్దతివ్వండి’’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని బీజేపీ యోచిస్తున్నట్లు తేలిందని, ప్రజలు ప్రధానికి ఎందుకు ఓట్లు వేయాలని మంత్రి ప్రశ్నించారు.

కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించాలని, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ (PRLI) పథకానికి జాతీయ హోదా కల్పించాలని గత ఎనిమిదేళ్లుగా  కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా …  వీటిని పట్టించుకోలేదు.

అలాంటప్పుడు ప్రజలు మోదీకి ఎందుకు ఓట్లు వేయాలని, బీజేపీ, కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసులు వేస్తూ పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో లేవనెత్తడంలో బీజేపీ రాష్ట్ర విభాగం విఫలమైంది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం మహబూబ్‌నగర్‌లో జరుగుతున్నందున, పిఆర్‌ఎల్‌ఐకి జాతీయ హోదా ఇవ్వాలని, కృష్ణా నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని బిజెపి నాయకులు తీర్మానాలు చేయాలన్నారు.

తెలంగాణలోని బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ తీర్మానాలను ఆమోదించి రాష్ట్రం పట్ల తమ నిబద్ధతను నిరూపించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను’’ అని కేటీఆర్ అన్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles