33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

అదానీ సహా అస్మదీయ కంపెనీల కోసం ఎల్ఐసీ వంటి ‘పీఎస్‌యూ’లు బలి… సీఎం కేసీఆర్!

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న దురదృష్టకర విధానాల వల్ల దేశంలో పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలోని  భారత రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది.  అందుకే రానున్న  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం తీరును ఎండగట్టాలని పార్టీ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు.

కేంద్రం చేసిన తప్పులను దేశం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి రాష్ట్ర, దేశ సమస్యలపైనా  గళం విప్పాలని ఎంపీలకు ఉద్బోధించారు. సీఎం  మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో కలిసి వచ్చే ఇతర పార్టీలను కలుపుకుని పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. నాలుగు గంటలకు పైగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య, ప్రమాదకర విధానాల వల్ల భారత్‌కు తీరని నష్టం జరుగుతోందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.

‘దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకొంటున్న సంపదంతా అప్పనంగా తమ కార్పొరేట్‌ స్నేహితులకు కట్టబెడుతున్నారు. తమకు అనుకూల కార్పొరేట్‌ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ, లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేస్తోంది. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెడుతోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. అస్మదీయ కంపెనీల డొల్లతనం బైటపడుతూ వారి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతూ ఒక రోజులోనే లక్షల కోట్ల రూపాయలు  నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తోందని సీఎం అన్నారు.

అస్మదీయ కంపెనీల లాభాలన్నీ నీటిబుడగలేనని స్పష్టమవుతోంది. లాభాలను ప్రైవేట్‌ పరం చేస్తూ, నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రమాదకర ఆర్థిక విధానాల మీద పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు గొంతెత్తాలి. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్రంగా ఖండించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్ర, రాష్ట్రాల నడుమ సంధాన కర్తలుగా ఉండాల్సిన గవర్నర్లను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొంటున్న దుర్మార్గ విధానాలను బీఆర్‌ఎస్‌ ఎంపీలుగా మీరు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలి. రాష్ట్ర క్యాబినెట్‌ సహా, అత్యున్నత సభలైన శాసన సభ, శాసన మండలి తీసుకొన్న నిర్ణయాలను సైతం ఉద్దేశపూర్వకంగా గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల విధానాలను, కేంద్రం వైఖరిని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలి’ అని సీఎం తమ ఎంపీలకు సూచించారు.

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  ”రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవితంపై కేంద్రం సీరియస్‌గా లేదు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలను పార్లమెంట్ ఉభయ సభల ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా లేదని, ఈ విషయంలో ఎంపీలు గళం విప్పాలని సీఎం స్పష్టం చేశారు. మొత్తంగా తెలంగాణకు దక్కాల్సిన అనేక హక్కుల కోసం ఎంపీలు పార్లమెంట్‌లో గళం విప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles