24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

కేంద్ర బడ్జెట్… పత్తి రైతులకు భారీ షాక్!

హైదరాబాద్‌: ఈ దఫా కేంద్రబడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా పత్తి రైతులకు షాక్‌ తగిలింది. అంతేకాదు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా బడ్జెట్‌లో భారీ కోత విధించారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో పత్తి కొనుగోలు కోసం కేంద్రం కేటాయించిన నిధుల మొత్తం అక్షరాల రూ. లక్ష మాత్రమే. గత ఏడాది రూ.9,243.09 కోట్ల కేటాయింపులు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోలు బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలనుకుంటున్నట్టు  ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మద్దతు ధర పథకంలో భాగంగా కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోళ్లకు ఉద్దేశించిన కేటాయింపులు 2021-2022లో రూ.8,331.96 కోట్లు, 2022-2023లో రూ.9,243.09 కోట్లు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు బడ్జెట్ కోతపై ఆర్థిక మంత్రి టీ.హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.  ఇది కచ్చితంగా పత్తి రైతులకు ‘తీవ్ర నష్టం’ కలిగించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండి, పత్తి సాగు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతుల, పేదల వ్యతిరేక బడ్జెట్‌. అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో డొల్లతనమే కనిపిస్తున్నది. ఏడు ప్రాధాన్యత రంగాలని చెప్పి అసలు రంగాలను గాలికి వదిలివేశారు. దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను బడ్జెట్‌ నిరుత్సాహపరిచింది. అంతేకాదు తెలంగాణ రాష్ర్టానికి మరోసారి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్‌ ఇదేనని ఆర్థికమంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

మరోవంక ఇప్పటికే పత్తికి సరైన ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం పత్తికి మద్దతు ధర రూ. 6,080 ఉన్నది. కానీ రైతుకు క్వింటాలుకు కనీసం రూ.10 వేల ధర పలికితే గానీ గిట్టుబాటు కాని పరిస్థితులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి రైతులను నట్టేట ముంచుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles