23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

మెడికల్‌ డివైజెస్‌… @’మేడిన్‌ తెలంగాణ’ !

హైదరాబాద్: రాష్ర్టాన్ని వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ సారథ్యంలో మంత్రి కేటీఆర్‌ తీసుకుంటున్న చొరవతో మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌’ అంతర్జాతీయంగా పెట్టుబడులను అమితంగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్కులో కార్డియాక్‌ డయాగ్నోస్టిక్‌ టూల్స్‌, అల్ట్రాసౌండ్‌ పరికరాలు, మొబైల్‌ వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల ఉత్పత్తిని   ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. త్రీడీ ప్రింటెడ్‌ బయోనిక్‌ ఆర్మ్స్‌, ఇమేజింగ్‌ సిస్టమ్స్‌, మొబైల్‌ డయాలసిస్‌ యూనిట్లు, స్టెంట్లు, ఇంప్లాంట్ల ఉత్పత్తి ఇక్కడ భారీ ఎత్తున జరుగుతోంది.

వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులో వైద్య పరికరాల వాటే ఎక్కువ. మన దగ్గరే ఈ ఉత్పత్తులు ప్రారంభమై అందుబాటులోకి వస్తే నాణ్యమైన వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్‌ సాధనాలు తక్కువ ధరలకే లభిస్తాయి. దీంతో ప్రజలకు వైద్య చికిత్స ఖర్చు కూడా తగ్గి మేలు జరుగుతుంది.

ఒకప్పుడు ఇక్కడి ప్రజలు నాణ్యమైన స్టెంట్‌లు, కాథెటర్‌లను దిగుమతి చేసుకోవడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ దారైన ఎస్‌ఎంటీ సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడంతో… తెలంగాణ ఇప్పుడు ఏటా మిలియన్ స్టెంట్‌లు, 1.25 మిలియన్ బెలూన్ కాథెటర్‌ల ఉత్పత్తి సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రానికి నిలయంగా మారింది.

అమెరికా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా 89 దేశాలకు ఇప్పుడు ‘మేడ్ ఇన్ తెలంగాణ’ స్టెంట్‌లు, కాథెటర్‌లు ఎగుమతి చేసేంతగా ఇప్పుడు తెలంగాణ ఎదిగిపోయింది.

కంటి వెలుగు కార్యక్రమం రెండో దశలో భాగంగా పంపిణీ చేస్తున్న కళ్లద్దాలు కూడా ‘మేడ్ ఇన్ తెలంగాణ’నే కావడం విశేషం. అకృతి ఆప్తాల్మిక్ ప్రైవేట్ లిమిటెడ్ 90 రోజుల రికార్డు సమయంలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 10 లక్షల కళ్లద్దాల యూనిట్లను తయారు చేసి ప్రభుత్వానికి అందించింది.

కంటి వెలుగు ఫేజ్‌-2ను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత 35 లక్షల కళ్లద్దాలు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కళ్లద్దాల్లో ఎక్కువ భాగం తెలంగాణలో యూనిట్లు నిర్వహిస్తున్న కంపెనీల నుంచి లభిస్తున్నాయి.

ఇదంతా ఒక్కరోజులో సాధించింది కాదు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం పటాన్‌చెరులోని సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేసింది. ఈ వైద్య పరికరాల పార్క్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మెడ్‌టెక్ R&D, ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌గా మారింది. అంతేకాదు ప్రముఖ మెడ్‌టెక్ కంపెనీలకు గమ్యస్థానంగా కొనసాగుతోంది.

“అంతేకాదు 50 కంపెనీలు దాదాపు రూ.1500 కోట్ల మొత్తం పెట్టుబడి,  దాదాపు 7,000 ప్రత్యక్ష ఉద్యోగాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా, మెడ్‌ట్రానిక్, బి-బ్రాన్ మొదలైన మార్క్యూ కంపెనీలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాయి” అని తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ అన్నారు.

మెడికల్ డివైజెస్ పార్క్‌లో మరిన్ని కర్మాగారాల ఏర్పాటుతో పాటు, కంపెనీలకు వాల్యూ చైన్‌ను పెంచడానికి  ప్రపంచ సంబంధిత ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడే  వాతావరణాన్ని సృష్టించాం. దీంతో తెలంగాణ త్వరలో వైద్య పరికరాల రంగంలో గ్లోబల్ లీడర్‌గా అవతరించనుందని నాగప్పన్ తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles