ముహమ్మద్ ముజాహిద్….✍️
ముఖ్యాంశాలు
జీతం లేని వెట్టిచాకిరీలో భారత్ అగ్రస్థానం..
విధి నిర్వహణలో నివురుగప్పిన నిప్పులా శ్రామిక లోకం
ఏడీపీ ‘పీపుల్ ఎట్ వర్క్ 2026’ నివేదిక ఘాటు నిజాలు
వారానికి 16 గంటలకు పైగా ఉచిత శ్రమ..
అట్టడుగున ఉత్పాదకత, ఉద్యోగ భద్రత.
అక్షరాల చెమటోడ్చి, అంకితభావంతో పనిచేస్తున్న శ్రామిక శక్తికి తగిన ప్రతిఫలం దక్కడం లేదా? అంటే.. ‘అవును’ అనే దిగ్భ్రాంతికరమైన నిజాలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఏడీపీ’ (ADP) తన తాజా నివేదికలో బట్టబయలు చేసింది. ఏ ఎలాంటి వేతనం, అదనపు ప్రతిఫలం ఆశించకుండా.. గంటల తరబడి (ఉచిత) శ్రమను ధారపోస్తున్న శ్రామిక దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరింది.
‘పీపుల్ ఎట్ వర్క్ 2026’ పేరుతో వెలువడిన ఈ నివేదిక దేశంలోని కార్మిక లోకం ఎదుర్కొంటున్న మౌలిక సంక్షోభాన్ని, యాజమాన్యాల దోపిడీ స్వభావాన్ని అద్దం పడుతోంది. లెక్కలేనన్ని గంటలు.. ప్రతిఫలం శూన్యం!దేశంలో ఏకంగా 24 శాతం మంది ఉద్యోగులు వారానికి 16 గంటలకు పైగా ఎలాంటి వేతనం లేకుండానే అదనంగా శ్రమిస్తున్నట్లు ఈ నివేదిక తేల్చిచెప్పింది.
ఇక మరో 40 శాతం మంది ఉద్యోగులు వారానికి 6 నుంచి 15 గంటల వరకు అదనపు వేతనం లేని పనులకే తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. అంటే, దేశంలోని కోట్లాది మంది శ్రామికులు తమ రోజువారీ వేతన నిబంధనలకు మించి భారీగా ఉచితంగా శ్రమిస్తున్నారన్న కఠిన సత్యం దీని ద్వారా స్పష్టమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తే.. కేవలం 12 శాతం మంది మాత్రమే 16 గంటలకు పైగా ఉచితంగా పనిచేస్తుండగా, భారత్‌లో ఈ నిష్పత్తి అత్యంత తీవ్ర స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.ఎక్కువ పని.. ప్రయోజనం శూన్యం!గంటల తరబడి అదనంగా పనిచేస్తే సంస్థకు లాభం, ఉద్యోగికి మంచి గుర్తింపు వస్తుందనేది యాజమాన్యాల భ్రమ మాత్రమేనని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అదనపు గంటల శ్రమ ఎప్పుడూ మెరుగైన పనితీరుకు గానీ, పెరిగిన ఉత్పాదకతకు గానీ కొలమానం కాదని అధ్యయనం హెచ్చరిస్తోంది.
భారీగా ఉచిత పని గంటలను మోస్తున్న శ్రామికుల్లో అధిక భాగం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాము ఆశించిన స్థాయిలో ఉత్పాదకతను సాధించలేకపోతున్నామన్న మథనంతో సతమతమవుతున్నారు. ఈ తరహా ఉద్యోగులు తమ విధి నిర్వహణలో కొంత మేర తృప్తిని పొందుతున్నట్లు పైకి కనిపించినప్పటికీ.. ఆ వెనుక నిరాసక్తత, నిత్య ఆందోళన, తరిగిపోతున్న వ్యక్తిగత వికాసం, చివరకు ఉద్యోగాన్నే వదిలివెళ్లాలనే తీవ్ర ఆలోచన (అట్రిషన్) వెంటాడుతున్నట్లు నివేదిక నిర్ధారించింది.
రిమోట్ ఉద్యోగులు, యువతపైనే పెనుభారంకార్యాలయాల నాలుగు గోడల మధ్యే కాకుండా, టెక్నాలజీ పుణ్యమా అని ఇంటి నుంచి పనిచేస్తున్న (రిమోట్) ఉద్యోగులపై ఈ వెట్టిచాకిరీ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. హైబ్రిడ్ లేదా సాధారణ ఆఫీస్ ఉద్యోగులతో పోలిస్తే.. రిమోట్ విధానంలో ఉన్నవారే భారీగా ఉచిత పని గంటలను లెక్కిస్తున్నట్లు వెల్లడైంది. ఇక ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా డిజిటల్ తెరల వెనుక గడుపుతూ, ఆఫ్-ది-క్లాక్ గంటలను నష్టపోతున్న వారిలో యువ ఉద్యోగులదే సింహభాగం కావడం గమనార్హం.
అ attendance షీట్లు, లాగిన్ గంటల లెక్కలతో మాత్రమే ఉద్యోగుల సమర్థతను అంచనా వేయలేమని ఈ నివేదిక యాజమాన్యాలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. అడ్డగోలుగా పెరిగిపోతున్న ఉచిత శ్రమ.. రేపటి రోజున దేశ శ్రామిక శక్తి ఆరోగ్యాన్ని, సంస్థల మనుగడను ఏ విధంగా దెబ్బతీయనుందో ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి.


