23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణలో రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ‘కెమ్ వేద’!

హైదరాబాద్‌: రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరుపుతున్న పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ ‘కెమ్‌వేద’ ముందుకొచ్చింది. శాండియాగోలోని ఆ సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసింది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా పేరున్న కెమ్‌వేద.. ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్‌ తదితర పరిశ్రమలకు సేవలు అందిస్తున్నది. తెలంగాణలో 45 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థలో ప్రస్తుతం 450 మంది పనిచేస్తున్నారు. రెండు చోట్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థను మరింత విస్తరించేందుకు రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కెమ్‌వేద వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అద్భుతంగా ఉండటం, నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణాలని తెలిపింది.

పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్‌: కేటీఆర్‌
అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించిన కెమ్‌వేద లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ ఎకో సిస్టంలోని మానవ వనరులను ఉపయోగించుకొని ప్రత్యేకంగా రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రిసెర్చ్‌ ఎకో సిస్టంను ఈ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ మరింత బలోపేతం చేస్తుందన్నారు. కెన్‌వేద కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ తోడ్పాటునందిస్తుందని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో విస్తరణ సంతోషదాయకం..
హైదరాబాద్‌లో తమ కంపెనీ వేగంగా దూసుకెళ్తున్నదని కెమ్ వేద సీఈవో భీమారావు పారసెల్లి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ వృద్ధిలో తమ కంపెనీ భాగస్వామి కావవటం అమితానందాన్ని కలిగిస్తున్నదని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దీని ద్వారా 500 మంది హైసిల్డ్‌ నిపుణులకు పరిశోధన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. భవిష్యత్తులో తమ కంపెనీని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, లైఫ్‌ సైన్సెస్‌ విభాగం డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles