32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

గాన కోకిల లతా మంగేష్కర్‌ కన్నుమూత!

ముంబయి: లక్షలాది మంది “నైటింగేల్ ఆఫ్ ఇండియా” అని పిలవబడే బాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ లతా మంగేష్కర్ (92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురై నేడు దివంగతులయ్యారు. ప్రముఖ థియేటర్ యాక్టర్, క్లాసికల్ సింగర్ అయిన పండిట్ దీనానాథ్ మంగేష్కర్, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్ 28న లతామంగేష్కర్ జన్మించారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్, మీనా కదికర్లు లత మంగేష్కర్ తోబుట్టువులు. తండ్రి వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత ఐదేళ్ల వయసులో ఆలపించటం మొదలు పెట్టారు. 13 సంవత్సరాల వయస్సులో ఆమె వృత్తిని ప్రారంభించారు, ఆమె తండ్రి మరణించడంతో ఆమె తన తల్లి మరియు నలుగురు తోబుట్టువులను చూసుకోవాల్సి వచ్చింది. 20 భాషల్లో వెయ్యి సినిమాల్లో 50 వేలకుపైగా పాటలు పాడిన లతా జీ సరస్వతీ స్వర నిధి. వెండితెర మీది నటి హావభావాలను అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్లను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. కానీ, సింగర్‌గా లతా జీ సమయం ఇచ్చాకే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాటంటే లతా జీ.. లతా జీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడించిన లతా మంగేష్కర్, ఉత్తర దక్షిణాదికి సంగీత సరిగమల వారధి. హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల, తన గాత్రంలో ఉర్దూ భాషలోని గజల్ గమకాల సొబగులను వొలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. క్వీన్ ఆఫ్ మెలోడీ.. నైటింగేల్ ఆఫ్ ఇండియా.. స్వ‌ర కోకిల‌.. ఎలా పిలిచినా ఆమె గానం సుమ‌ధుర‌మే. హిందీ పాట‌ల‌తో యావ‌త్ దేశాన్ని ఊర్రూత‌లూగించింది ఆమె తీయ‌ని స్వ‌రం. దేశ‌భ‌క్తి గీత‌మైనా.. ప్ర‌ణ‌య రాగ‌మైనా.. భావోగ్వేద పాటైనా.. ల‌తా మంగేష్క‌ర్ పాడితే అది అజ‌రామ‌ర‌మే.
యే మేరే వ‌త‌న్ కే లోగో అంటూ ల‌తాజీ పాడిన దేశ‌భ‌క్తి గీతం ఎవ‌ర్‌గ్రీన్‌. ఆ పాట‌లోని స్వ‌రం దేశ ప్ర‌జ‌ల్లో నింపిన చైత‌న్యం అన‌న్యం.. తేనలూరే త‌న గొంతుతో మంగేష్క‌ర్ యువ‌తలో దేశ భ‌క్తిని ర‌గిలించిన తీరు అపూర్వం..ఇండియా, చైనా మ‌ధ్య 1962లో జ‌రిగిన యుద్ధం నేప‌థ్యంలో ఈ పాట‌ను రాశారు. ఆ త‌ర్వాత ఈ పాట ప్ర‌తి ఒక్క భార‌తీయుడిలో జాతీయ భావాన్ని నింపింది. ఈ పాట‌ను ల‌తా మంగేష్క‌ర్ 1963, జ‌న‌వ‌రి 27వ తేదీ ఢిల్లీలోని స్టేడియంలో అప్ప‌టి ప్ర‌ధాని నెహ్రూ, రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ స‌మ‌క్షంలో ఆమె పాడారు. స్వ‌చ్ఛ‌మైన దేశ‌భ‌క్తి క‌లిగిన ఎవ‌రైనా ల‌తా మంగేష్క‌ర్ స్వ‌రానికి దిగ్భంధం కావాల్సిందే అని నెహ్రూ అన్నారు. అయితే తొలి సారి స్టేడియంలో ఈ పాట విన్న నెహ్రూ వేదిక పైనే కంటతడి పెట్టుకున్నారు. ఈ సాంగ్‌ను రాసింది క‌వి ప్ర‌దీప్‌. ఈ పాట‌ను రాయ‌డానికి దారితీసిన ప‌రిస్థితుల్ని ఓ సంద‌ర్భంలో క‌వి ప్ర‌దీప్ వివ‌రించారు. ముంబైలోని మ‌హిమ బీచ్‌లో న‌డుస్తున్న స‌మ‌యంలో త‌న‌కు ఆ ఆలోచ‌న వ‌చ్చిందని అత‌ను అప్పట్లో చెప్పాడు.    ఏ ప్యార్‌ కియాతో డర్నా క్యా (‘మొఘల్‌–ఎ–ఆజమ్‌’– 1960, నౌషాద్‌) ఆరు దశాబ్దాల క్రితం ప్రాణం పోసుకున్న ఈ పాట ఈనాటికీ శ్రోతల హృదయాల్లో మారుమోగడానికి ఇదో బలమైన కారణం.
ఏ సత్యం శివం సుందరం(‘సత్యం– శివం– సుందరం’– 1978, లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌) రాజ్‌కపూర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సత్యం–శివం–సుందరం’ సినిమాలో  లత పాడిన ఈ పాట  ఆధ్యాత్మిక జీవుల్లో ఒక చెరగని ముద్రగా మిగిలిపోయింది.
‘తుఝె దేఖా తో యే జానా సనమ్’  దిల్ వాలే దుల్హానియా లేజాయేంగీ నేటి తరం యువతకు ప్రేమ అంటే గుర్తుకొచ్చే పాట  ఈ పాట కూడా లతా స్వరం నుంచి జాలువారింది. దిల్ వాలే చిత్రం బాలీవుడ్లో గా నిలవడంలో ఈ పాట పాత్ర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చాలా ఉంది. ఆమె స్వరానికి భారత యువత పులకించి పోయింది. యువతను ఆమె పాటలకు పెద్ద ఫ్యాన్స్ గా మార్చేసింది. గాన కోకిల లతాజీ తెలుగులో కేవలం మూడంటే మూడు పాటలే పాడారు. ఇండియన్‌ నైటింగల్‌ పాడిన తెలుగు పాటల్లో ఒకటి 1955లో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన ‘సంతానం’ చిత‍్రంలోనిది. సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించిన ‘నిదురపోరా తమ్ముడా’ పాట లతా మంగేష్కర్‌ పాడిన తొలి తెలుగు పాట. తర్వాత 1965లో  నందమూరి తారక రామారావు, జమున జంటగా నటించిన ‘దొరికితే దొంగలు’ సినిమాలోది. ఇందులో ‘శ్రీ వెంకటేశా’ అనే గీతాన్ని ఆలపించారు లతా మంగేష్కర్‌. ఈ పాటను సాలూరి రాజేశ్వర రావు కంపోజ్‌ చేశారు. ఇక తెలుగులో లతా మంగేష్కర్‌ పాడిన మూడో పాట చివరి పాట ‘తెల్ల చీరకు’ అనే సాంగ్‌. ఈ పాట కింగ్‌ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన ‘ఆఖరి పోరాటం’ చిత్రంలోనిది. 1988లో వచ్చిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించగా, దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు లతా మంగేష్కర్‌. లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గానూ తొలిసారి 1969లో పద్మ భూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత 1999లో పద్మ విభూషణ్ సత్కరించింది. 2001 భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను అప్పటి రాష్ట్రపతి కె. ఆర్. నారాయణ్ చేతుల మీదుగా మంగేష్కర్ అందుకున్నారు. ‘దాదా సాహెబ్ ఫాల్కే(1989) అవార్డులను అందుకున్నారు. ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ‘ది లీజియన్ ఆఫ్ హానర్’ పురస్కారం సైతం ఆమె పొందారు. లతాజీకి ఇష్టమైన అట క్రికెట్.. లార్డ్స్ స్టేడియంలో ఆమెకి ప్రత్యేకమైన, శాశ్వతమైన గ్యాలరీ ఉంది.  రాజ్యసభ ఎంపీగా ఉన్నకాలంలో ఒక్క రూపాయి జీతం కూడా తీసుకొని ఏకైక ఎంపీ ఆమె. ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, విపక్ష నేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తూ… ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారని, ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారతదేశానికి లతా మంగేశ్వర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. మొత్తంగా లతాజీ మరణంతో పాట మూగ బోయింది, ‘సంగీత మహల్’ ఆగిపోయింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles