31.7 C
Hyderabad
Saturday, May 4, 2024

మేడారం జాతరకు వేళయింది… నేటినుంచి 4రోజుల పాటు!

ములుగు, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించబడే మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర మహా గొప్ప వేడుక. ఇది కేవలం తెలంగాణలోనే కాక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిచెందింది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో గల మేడారం అనే చిన్న గ్రామంలో ఈ జాతర నేడు ఆరంభమయింది. వరంగల్ నుంచి సుమారు 104 కిమీ, హైదరాబాద్ నుంచి సుమారు 238 కిలో దూరంలో మేడారం ఉంటుంది. రెండేండ్లకు ఒకసారి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు కన్నులపండుగగా, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుండి కూడా సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎక్కడెక్కడి నుంచో వీవీఐపిలు కూడా ఈ జాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధిక మంది హాజరయ్యే జాతర ఇదే.
@ చారిత్రక నేపథ్యం..
చరిత్ర ప్రకారం చూస్తే, కాకతీయుల కాలంలో కొంతమంది పాలకులు చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా తిరగబడ్డ ఇద్దరు తల్లీకూతుళ్లు సమ్మక్క, సారలమ్మల పోరాటాన్ని ఈ జాతర గుర్తు చేస్తుంది, అనంతర పరిణామాల తర్వాత కాకతీయ రాజులు తమ తప్పులు తెలుసుకొని సమ్మక్కకు భక్తులుగా మారినట్లు చరిత్ర చెబుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు కేవలం గిరిజనులు మాత్రమే చిలకలగుట్ట అనే ఒక కొండపైన జరుపుకునే వారు, కానీ 1940 తర్వాత నుంచి తెలంగాణలో అన్ని వర్గాలు, మతాలకు చెందిన ప్రజలంతా కలిసి జరుపుకోవడం ప్రారంభించారు. ఏటేటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు.
సమ్మక్క- సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలూ ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటి మధ్య ఉండే చెట్టు మానులనే దేవతా మూర్తులుగా కొలుస్తారు. జాతర జరిగే నాలుగు రోజుల పాటు వివిధ ఘట్టాలు ఉంటాయి. ఈ తంతునంతా ఎంతో నిష్ఠగా జరిపేది వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే కావడం ఈ జాతరకున్న మరో ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగురోజుల జాతర… జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. సారలమ్మ, పగిడిద్ద రాజులు మేడారం గద్దెకు చేరుకున్న సందర్భంగా ఉత్సవం నిర్వహిస్తారు. మేడారం జాతర యొక్క రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉండే సమ్మక్క మేడారం గద్దెకు చేరుకుంటుంది. ఆమె రాక సందర్భంగా ‘ఎదురుకోళ్ల’ ఘట్టం నిర్వహిస్తారు. ప్రభుత్వం అధికార లాంఛనాల మధ్య సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. జాతర మూడో రోజున సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంటారు. ఈరోజు జాతరలో అతి ముఖ్యమైన రోజు, ఇదే రోజున భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సమ్మక్క సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన సమర్పణ ‘బంగారం’. భక్తులు తమ బరువుకు సరితూగే ‘కొత్త బెల్లం’ను దేవతలకు బంగారంగా సమర్పిస్తారు. మేడారం జాతరలో చివరి రోజున సమ్మక్క సారలమ్మల వనప్రవేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. వారిని గద్దెపైకి ఆహ్వానించేటపుడు ఏ రకమైన గౌరవం లభిస్తుందో, తిరిగి వెళ్లేటపుడు కూడా అదే స్థాయి అధికార లాంఛనాలతో సాగనంపుతారు. కోట్లాది మంది భక్తుల పూజలందుకున్న తరువాత, ఆ వన దేవతలు తిరిగి అడవిలోకి అంతర్ధానం అవుతారు, దీంతో మేడారం జాతర ముగుస్తుంది. అడవి బిడ్డల వీరత్వానికి, ఆదివాసులు ఆత్మాభిమానానికి, అమరులైన శూరుల త్యాగనిరతికి ఈ జాతర ఓ సంకేతం.
@ మేడారంకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్​ సేవలు!
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్​ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. 20 వరకు అందుబాటులో ఉంటాయి. జాయ్​రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల హెలికాప్టర్​ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు. జాయ్​రైడ్ ద్వారా గగన విహారం చేస్తూ మేడారం జాతర చూడవచ్చు. సుమారు 7 నుంచి 8 నిమిషాల వరకు ఈ అవకాశం ఉంటుంది. హనుమకొండ -మేడారం వరకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు షటిల్​ సర్వీస్​లు అందుబాటులో ఉంటాయి. షటిల్ సర్వీస్​తో.. 20 నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోవచ్చు. కరీంనగర్ -మేడారం, హైదరాబాద్-మేడారం, మహబూబ్​నగర్-మేడారం రూట్లలో చార్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో 5 సీట్స్ ఉంటాయి. వీఐపీ దర్శనం కూడా కల్పిస్తారు.
@ హెలికాప్టర్​ సర్వీస్​ల పూర్తి వివరాలు..
‘జాయ్​రైడ్​ సర్వీస్‘​ మేడారంలో గగన విహారం 7-8 ని.ల పాటు జాతర విహంగ వీక్షణం 3,700/-
‘షటిల్​ సర్వీస్‘ హనుమకొండ -మేడారం కేవలం 20 నిమిషాల్లో జాతరకు 19,999/-
‘చార్టర్ సర్వీస్‘ హైదరాబాద్-మేడారం ఇందులో 5 సీట్లుంటాయి.-వీఐపీ దర్శనం కల్పిస్తారు. 75,000
కరీంనగర్ -మేడారం 75,000
మహబూబ్​నగర్-మేడారం 1,00,000 రూపాయల వరకు వసూలు చేస్తారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles