32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

వయసు మనసుకు లేదు

వయసు అనేది మన బుర్రలో ఉంటుందనుకుంటే పొరబాటు. ఇది నిజానికి సౌందర్య ఉత్పత్తులు, చర్మసౌందర్యం కాపాడుకునే ప్రయత్నాలు, డైట్ ప్లానుల గందరగోళం. ఇదంతా ఒక పెద్ద మార్కెటింగ్ మాయాజాలం

వయసును కనిపించనివ్వకుండా చేసే ప్రయత్నాలు మనదేశంలో కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అంటే మార్కెటు చాలా ఆలస్యంగా వచ్చింది. కాని వయసు విషయంలో అబద్దాలు చెప్పడం మనకు అలవాటే కాబట్టి వయసు కనిపించకుండా చేసే ఉత్పత్తులు రాగానే ఆదరణ కూడా లభించింది.

వయసు కనిపించకుండా చేసే సాంప్రదాయిక పద్ధతులు మనకు చాలా ఉన్నాయి. రసాయన విధానాలు, తేనె, పసుపు, నానావిధ మూలికలను కలిపేసి వయసు పెరక్కుండా ఆపేసే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నాం. శతాబ్దాలుగా ఈ పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. 2021 నాటికి ప్రపంచంలో యాంటీ ఏజియింగ్ మార్కెట్టు అంటే వయసు పెరక్కుండా చేసే ఉత్పత్తుల అమ్మకాలు 216 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయంట. వయసుపై మనిషి చేస్తున్న యుద్ధం ఇంట్లో తయారు చేసుకునే పసుపు, తేనె మిశ్రమాలకు పరిమితం కాదు. డైట్ ప్లానులకు పరిమితం కాదు. ఇప్పుడు యాంటీ ఏజీయింగ్ అనేది బోటాక్స్, జువెడెర్మ్ వంటి మందులతో యవ్వనాన్ని మళ్ళీ సాధించుకునే స్థాయికి చేరుకుంది.

దీనంతటికి కారణం మార్కెట్ మాయాజాలం. కన్సూమరిజం. ఒక మనిషికి విలువ ఎలా లభిస్తుందో మార్కెట్ వాణిజ్య ప్రకటనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళకు విలువ ఎలా లభిస్తుంది? ఎలా ఆత్మస్థయిర్యం పెరుగుతుందన్నది వాణిజ్య ప్రకటనలే చెబుతున్నాయి. మనిషికి సహజంగానే యవ్వనంతో ఉండాలని కోరిక ఉంటుంది. ఆ కోరికను మార్కెట్టు క్యాష్ చేసుకుంటోంది. అందువల్లనే వాణిజ్య ప్రకటనలు లేదా మార్కెట్ మాయాజాలంలో ఇరుక్కుపోతున్నాం. బోటాక్స్ ట్రీట్ మెంట్ వంటి బాధాకరమైన, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న, అవమానకరమైన చికిత్సకు కూడా సిద్ధపడుతున్నారు.

పాశ్చాత్యదేశాల్లో ఇప్పుడు యాంటీ ఏజియింగ్ అనే పదం వాడుకలో లేదు. ఇప్పుడు పాశ్చాత్యదేశాల్లో వయసు కనిపించకుండా కాస్త దాచిపెట్టే, అంటే ముడుతలు కనిపించకుండా చేసే యాంటి రింకిల్, ప్రో ఏజ్, ఏజ్ పర్ ఫెక్ట్, స్లో ఏజ్ పద్ధతులు పాటిస్తున్నారు. మరో పదం వినిపిస్తోంది. అది రేడియంట్ స్కిన్ కేర్. అంటే ముడుతలు పడిన చర్మం ఉంటే అలాంటి ఇంటి నుంచి బయటకు రాకూడదు.

గతంలో 50 సంవత్సరాలకు పైబడిన మహిళలు వయసు దాచిపెట్టడానికి యాంటీ ఏజ్ సొల్యుషన్లు కొనుక్కునేవారు. కాని ఇప్పుడు ముప్పయి సంవత్సరాల యువతులు కూడా కొంటున్నట్లు తెలుస్తోంది. మనం సాధారణంగా వయసు అనేది మన మనసులో ఉంటుందని అంటుంటాం. ఇలాంటి ఆలోచనలు కూడా నిజానికి వయసు తక్కువగా ఉన్నట్లు కనబడాలన్న అభిప్రాయాన్నే బలపరుస్తుంటాయి.

మన వయసు ఎంత ఉందో అంత కనబడితే తప్పేమిటి? వయసును ఎందుకు దాచుకోవాలి?

ఇదంతా మానసికతకు సంబంధించిన విషయం. ముసలితనం వచ్చిందన్న ఆలోచన మనసులో లేకపోయినా, ముసలివారిలా కనబడకపోయినా, ముసలివారని చెప్పుకోకపోయినా ఏం చేసినా వయసు మీద పడడం అనేది ఆగదు. కాబట్టి యాంటీ ఏజింగ్ మందులతో, సొల్యుషన్లతో వయసును కప్పిపుచ్చుకునే ప్రయత్నాల వల్ల, డైట్ ప్లానుల వల్ల సాధించేది ఏముంది? ఇలాంటి ప్రయత్నాలు మరి మితిమీరితే మనిషిలో ఆత్మవిశ్వాసమే అంతరిస్తుంది.

ఆధునిక కాలంలో మనిషి అనేక విషయాలను స్వీకరించడానికి అలవాటు పడుతున్నాడు. శరీరం, లైంగికత, వాంఛలు కోరికలు అన్నింటి విషయంలో వాస్తవాలను అంగీకరించడం జరుగుతోంది. కాని వయసు విషయంలో మాత్రం ఇంత విశాలంగా ఆలోచించడం లేదు. మీరంత వయసు ఉన్నట్లు కనబడడం లేదు అని ఎవరైనా అంటే పొంగిపోకుండా ఉండేవారు చాలా తక్కువ. అది గొప్ప పొగడ్తగా భావించడమే జరుగుతుంది.

తక్కువ వయసు కనిపించాలన్న కోరిక మహిళల్లో ఉండడం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. సమాజంలో వారిని అందానికి ప్రతీకగా చూడడం ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి. కాని ఇప్పుడు పురుషులు కూడా అందంగా కనిపించాలన్న తాపత్రయంలో మునగిపోయి కనబడుతున్నారు. దీనంతటికి కారణం మార్కెట్. పురుషులు కూడా పోటీ పడడంతో ఇప్పుడు కాస్మటిక్ పరిశ్రమ మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది.

ఇప్పుడు ఎటు చూసినా యంగ్ బ్లడ్ అన్నదే వినిపిస్తుంది. యువరక్తం కావాలి. యువకులు రావాలి. ప్రతిరంగంలో యువకులకే అవకాశాలు దక్కాలన్న నినాదాలు, ఆలోచనలు కూడా వయసును దాచిపెట్టే ధోరణికి కారణమవుతున్నాయి. యంగ్ ఇండియాలో విజయాలు సాధించాలంటే యంగ్ గా కనబడాలి. లేకపోతే మార్గదర్శక్ పాత్రలకు పరిమితమై పోతామన్న భయం కూడా చాలా మందిలో ఉంది.

యువకులను ప్రోత్సహించడం ఎంత అవసరమో, అనుభవాన్ని గౌరవించడమూ అంతే అవసరం. వయసు మీద పడడం అన్నది ప్రతిభకు వ్యతిరేకం కాదు. వయసును గౌరవించడం ప్రతి మనిషి తన నుంచే ప్రారంభించాలి. తన వయసును తానే గౌరవించనట్లయితే బయటివారు గౌరవించడం సాధ్యం కాదు.

బోటాక్స్ వంటి ట్రీట్మెంట్లు తీసుకున్న చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయి. అలాగే హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ల వల్ల  కూడా ఇబ్బందుల పాలయినవారున్నారు. చర్మసౌందర్యానికి వాడే అనేక లోషన్ల వల్ల వచ్చే ఎలర్జీలు ఇతర సమస్యల బారిన పడిన వారున్నారు.

2035 నాటికి భారతదేశంలో కాస్మటిక్ పరిశ్రమ 35 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎందుకంటే టీనేజర్లలో కాస్మటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం కాస్మిటిక్ మార్కెట్ సైజు 6.5 బిలియన్ డాలర్లు. మరోవైపు హెర్మల్ కాస్మటిక్స్ పేరిట వస్తున్న ఉత్పత్తులు వేరే ఉన్నాయి. యువతరంలో 68 శాతం కాస్మటిక్స్ వాడి అందంగా కనిపించడం వల్ల ఆత్మస్థయిర్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నట్లు ఒక సర్వే చెప్పింది. గత ఐదేళ్ళ కాలంలో భారత పురుషులు కాస్మటిక్స్ కొనడం 42 శాతం పెరిగింది.

అందంగా కనిపించాలి. వయసు తెలియనివ్వరాదు అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఇది ఒక బలహీనత. ఈ బలహీనత మార్కెటుకు వరంగా మారింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles