26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

శ్రీలంక సంక్షోభానికి కారణాలేంటి..? చైనా ఎందుకు హ్యాండిచ్చింది? భారత్ ఏం చేస్తోంది?

శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి బోలెడు కారణాలు ఉన్నాయి. చైనాతో దోస్తీ చేసి అప్పుల భారం పెంచుకోవడం.. సేంద్రీయ సాగు కోసం వెంపర్లాడటం, కోవిడ్ ప్రభావంతో టూరిజం దెబ్బతినడం లాంటి కారణాలతో శ్రీలంక ఇప్పుడు దివాలా అంచున నిలిచింది.

ప్రధానాంశాలు:
▶️రాజపక్స విధానాలతో దివాలా అంచున శ్రీలంక
▶️భారత్‌కు వలస వస్తోన్న శ్రీలంక తమిళులు
▶️లంక ఆర్థిక కష్టాలకు బోలెడన్ని కారణాలు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.. మన పొరుగున ఉన్న ఈ బుల్లి ద్వీప దేశం దివాలా అంచున నిలిచింది. లంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. వంట గ్యాస్ కొరత కారణంగా.. వేలాది హోటళ్లు మూతపడ్డాయి. గంటల తరబడి కరెంట్ కోతలతో ప్రజలు కొవ్వొత్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే భారత్‌కు వలసలు ప్రారంభం కాగా.. రానున్న రోజుల్లో వేలాది మంది భారత్‌కు వలస వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుల భారం పెరగడం, ఆర్థిక ప్రణాళికలు సరిగా లేకపోవడం, ముందు చూపుతో వ్యవహరించక పోవడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారం, అవినీతి, తొందరపాటు నిర్ణయాలు.. ఇలా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరడానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి.

చైనాతో దోస్తీ, పెరిగిన అప్పులు:

శ్రీలంక ఆర్థిక కష్టాలకు బీజం 2007లో పడింది. అప్పట్లో శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న మహీంద రాజపక్స తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి దుస్థితికి ప్రధాన కారణమయ్యాయి. అప్పులు తీసుకోవడానికి వీలుగా రాజపక్స ప్రభుత్వ బాండ్లను మార్కెట్లలో విక్రయానికి ఉంచారు. ఇలా తీసుకున్న రుణాలే ఇప్పుడు శ్రీలంక అప్పుల్లో 38 శాతంగా ఉన్నాయి. మహీంద రాజపక్స చైనాకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చారు. కానీ చైనా నుంచి తీసుకున్న రుణాలే శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టాయి. దీంతో అప్పులు తీర్చడం కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. చివరికి డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో హంబన్‌టోట పోర్టును చైనాకు 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది.
మహీంద రాజపక్స అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో శ్రీలంకలోని ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులన్నీ చైనావే. 2005 నుంచి 2015 మధ్య శ్రీలంకకు చైనా 14 బిలియన్ డాలర్ల రుణం అందించింది. రాజపక్సతో ఉన్న సంబంధాల నేపథ్యంలో 2015 ఎన్నికల్లో రాజపక్స విజయం కోసం చైనా భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసిందని చెబుతారు. కానీ ఆ ఎన్నికల్లో రాజపక్స ఓడిపోయారు. మళ్లీ 2019లో అధికారంలోకి వచ్చారు. గత మూడేళ్లలో లంక ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది.

పన్నుల్లో కోత..
2019లో అధికారంలోకి వచ్చాక రాజపక్స పన్నులను విపరీతంగా తగ్గించేశారు. అదే సమయంలో నగదు ముద్రణ 42 శాతం పెంచారు. పన్నులు 33 శాతానికిపైగా తగ్గడం, బడ్జెట్ లోటు పెరగడం.. అదే సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో.. పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన టూరిజం ఘోరంగా దెబ్బతినడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. నిరుద్యోగ సమస్య తీవ్రమైంది.

కొంప ముంచిన సేంద్రీయ సాగు:
శ్రీలంకలో మహీంద రాజపక్స ప్రధానిగా ఉండగా.. ఆయన తమ్ముళ్లు గొటబొయ రాజపక్స అధ్యక్షుడిగా, బసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. రాజపక్సే ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపింది. కానీ అదే సమయంలో రైతులను సన్నద్ధం చేయలేకపోయింది. ఆర్గానిక్ ఫామింగ్ కోసమని.. రసాయన ఎరువుల దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో వరితోపాటు కూరగాయలకు అవసరమైన ఎరువులు సైతం అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ప్రభావంతో పంటల దిగుబడి గణనీయంగా తగ్గి, ఆహారధాన్యాల కొరత తలెత్తింది. బియ్యం, కూరగాయలు, నిత్యావసరాల ధరల పెరుగుదలకు ఇది దారి తీసింది. చివరికి సేంద్రీయ సాగు విధానం నుంచి శ్రీలంక ప్రభుత్వం వెనక్కి తగ్గినప్పటికీ.. అప్పటికే బాగా ఆలస్యమైంది.
కరోనా కోరల్లో టూరిజం విలవిల..
పర్యాటకం, తేయాకు ఎగుమతులు శ్రీలంక ప్రధాన ఆదాయ వనరులు. ఒక్క టూరిజం మీదే శ్రీలంకకు ఏటా 400 కోట్ల డాలర్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ కరోనా, అంతకు ముందు 2019లో కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ప్రభావంతో అంతర్జాతీయ పర్యాటకులు రావడం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో రాబడి తగ్గడంతోపాటు ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఆ దేశం దగ్గరున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి.

టూరిజం పడకేయడంతో నిరుద్యోగ సమస్య పెరిగింది.. ఆర్గానిక్ ఫార్మింగ్ కారణంగా పంటల దిగుబడులు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. బియ్యం, పంచదార, పప్పులు, మందులు లాంటి అవసరాల కోసం శ్రీలంక దిగుమతులపై ఆధారపడుతుంది. కానీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోవడంతో.. దిగుమతులకు కూడా వీలులేకుండా పోయింది.

అంతర్జాతీయ పరిణామాలు..

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం కూడా లంక కష్టాలను రెట్టింపు చేసింది. ముడి చమురు, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. చమురు దిగుమతులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో.. శ్రీలంక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌‌లపై రేషన్ విధించింది. బంకుల వద్ద క్యూలైన్లలో నిలబడుతున్న జనాలు కొట్లాటకు దిగకుండా సైన్యం కాపలా కాయాల్సిన దుస్థితి తలెత్తింది. పేపర్లు, ఇంకు కొరత కారణంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో శ్రీలంక ఉంది.

చేయిచ్చిన చైనా..

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న శ్రీలంక ఎప్పటిలాగే చైనా వైపు చూసింది. ఇన్నాళ్లూ కొలంబో అడిగినప్పుడల్లా అప్పులు ఇవ్వడంతోపాటు, తిరిగి చెల్లించే అప్పులను రీషెడ్యూల్ చేస్తూ వెసులుబాటు కల్పించిన చైనా సంక్షోభ పరిస్థితుల్లో మాత్రం ముఖం చాటేసింది. రుణాలను పునఃవ్యవస్థీకరించాలని 2021 డిసెంబర్లో గొటబొయ రాజపక్స చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కోరగా.. అటు నుంచి స్పందన లేదని సమాచారం.

భారత్ సాయం..

ఓవైపు శ్రీలంక‌కు చైనా హ్యాండ్ ఇవ్వగా.. భారత్ మాత్రం సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యవసరాల దిగుమతుల కోసం 1 బిలియన్ డాలర్ల రుణం అందించనున్నట్లు మార్చి 17న భారత్ ప్రకటించింది. గత నెలలోనే పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు కోసం శ్రీలంకకు భారత్ 500 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles