28.2 C
Hyderabad
Saturday, May 18, 2024

సీఏఏ వివక్షాపూరిత చట్టం, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుంది…ఆమ్నెస్టీ ఇండియా !

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం – సీఏఏ…  రాజ్యాంగ విలువలకు, అంతర్జాతీయ మానవహక్కులకు విరుద్ధమైన వివక్షాపూరిత చట్టం అని ఆమ్నెస్టీ ఇండియా పేర్కొంది. ఈ చట్టం సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఉందని వ్యాఖ్యానించింది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి మార్గం సుగమం చేస్తూ, పౌరసత్వ (సవరణ) చట్టం (CAA), 2019 అమలును కేంద్రం ప్రకటించింది.

లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందే నిబంధనలను నోటిఫై చేశారు. దీనితో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు మూడు దేశాల్లో మతపరంగా హింసకు గురవుతున్న మైనారిటీలకు… ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది.  అయితే ఆయా దేశాలనుండి వచ్చిన ముస్లింలను మాత్రం పరిగణనలోకి తీసుకోరు.

నోటిఫికేషన్ తర్వాత, ఆమ్నెస్టీ ఇండియా ఎక్స్‌లో ప్రభుత్వాన్ని విమర్శించింది.
“పౌరసత్వ సవరణ చట్టం (CAA) అనేది రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు విరుద్ధంగా ఉండే వివక్షాపూరిత చట్టం. (కేంద్ర) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనల నోటిఫికేషన్ కారణంగా ఈరోజు నుంచి విభజన చట్టం అమలులోకి వస్తుంది, ”అని  ఆమ్నెస్టీ ఇండియా ఎక్స్‌లో పేర్కొంది.

పౌర-రాజకీయ హక్కులపై అంతర్జాతీయ  ఒడంబడిక కింద హామీ ఇచ్చినట్లుగా, సమానత్వం హక్కును CAA ఉల్లంఘిస్తోందని మానవ హక్కుల సంఘం పేర్కొంది.

“2019లో శాంతియుతంగా నిర్వహిస్తున్న CAA వ్యతిరేక నిరసనలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది.   శాంతియుత నిరసనలకు ప్రతిస్పందిస్తూ భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సహవాసం, సమానత్వపు హక్కులను గౌరవించాలని మేము అధికారులను కోరుతున్నాము” అని ఆమ్నెస్టీ ఇండియా మరో పోస్ట్‌లో పేర్కొంది.

ఈ చట్టం ఏం చెప్తోంది?

పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 11న పార్లమెంటులో ఆమోదం పొందింది.

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం ఈ సవరణ లక్ష్యం.

అయితే, ఇందులో ముస్లింలను చేర్చలేదు. ఇది వివాదానికి కారణమైంది.

ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం చెప్పగా, తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముస్లిం వర్గాలు ఆరోపించాయి.

మరోవైపు ఈ చట్టం దేశ సెక్యులర్ భావనను ఉల్లంఘిస్తోందని కొందరు ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరూ మతం ఆధారంగా వివక్ష చూపకూడదు.

అయితే ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వం కల్పించే నిబంధన లేదు. ఈ కారణంగానే సెక్యులరిజానికి విఘాతం కలుగుతోందన్న ఆరోపణలు వినిపించాయి.

.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles