25.7 C
Hyderabad
Sunday, May 19, 2024

నీటి యుద్ధాల కాలం రాబోతోంది

భవిష్యత్తులో యుద్ధాలు నీటి కోసం జరుగుతాయని, మూడవ ప్రపంచయుద్ధం నీటికోసమే జరగొచ్చని చాలా మంది నిపుణులు హెచ్చరించారు. అనేక నదులు ప్రవహించే భారతదేశంలో నీటికి కరువొస్తుందా? గుక్కెడు తాగు నీటి కోసం మైళ్ళకొద్ది నడిచే గ్రామీణ ప్రాంతాలు నేటికి కూడా ఉన్నాయన్నది మరిచిపోరాదు. నీటివనరులు దేశంలో పుష్కలంగా ఉన్నప్పటికీ వాటర్ మేనేజిమెంట్ అనేది కనబడదు. జలసంపద అమూల్యమైనది. దాదాపు అరవై కోట్ల మంది ప్రజలు నీటి అవసరాల కోసం కేవలం రుతుపవనాలపై ఆధారపడే పరిస్థితి ఉంది. వానరాకడ ఎప్పుడో చెప్పలేని పరిస్థితి. రుతుపవనాలు ఆలస్యమైతే నీటి కష్టాలు ప్రారంభమవుతాయి. అయినా నీటివనరుల నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. రుతుపవనాల విషయంలో ఖచ్చితంగా చెప్పడం ఎన్నడూ సాధ్యం కాదు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి.

ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి గురించి వార్తలు చదువుతున్నాం. కొన్ని నగరాల్లో ప్రభుత్వం నీటి సరఫరాకు రేషన్ విధించింది. దక్షిణాఫ్రికాలో రోజుకు పాతిక లీటర్ల రేషను లెక్కన ప్రజలకు నీటిని అందిస్తున్న వార్తలు కూడా చదివాం. మైళ్ళ దూరం నుంచి ట్రక్కుల్లో వాటర్ ట్యాంకర్లలో నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితులున్నాయి. మన దేశంలోను కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులున్నాయి. దూరప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేయవలసి వస్తోంది. ప్రపంచ జనాభాలో ఆరవభాగం జనాభా మనదేశంలోనే ఉంది. కాని ప్రపంచంలోని భూభాగంలో కేవలం 2.4 శాతం నేల మాత్రమే భౌగోళికంగా మనవద్ద ఉంది. ప్రపంచంలోని తాగునీటిలో కేవలం 4 శాతం మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దీన్ని బట్టి దేశంలో జనాభాకు అవసరమైనంత తాగు నీటి నిల్వలు ఉన్నాయో లేదో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో దాదాపు సగం జనాభా నీటి ఎద్దడిని ఎదుర్కుంటుంది. దేశంలో నివసిస్తున్న 120 కోట్ల మంది ప్రజల్లో 74 కోట్ల 20 లక్షల మంది కేవలం వ్యవసాయం ప్రధానంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రుతుపవనాల వల్ల కురిసే వర్షాలే భూగర్భజలాలకు కూడా ఆధారం. వర్షాల వల్లనే 68 శాతం భూగర్భంలో నీటినిల్వలు చేరుతున్నాయి. కాలువలు, సాగునీరు, చెరువులు వగైరాల నుంచి భూమిలోకి నీరు ఇంకడం వల్ల భూగర్భంలో నీరు చేరడం అన్నది కేవలం 32 శాతమేనని తెలుస్తోంది.

దేశజనాభాను దృష్టిలో ఉంచుకుంటే భారతదేశంలో నీటి నిర్వహణ అన్నది చాలా లోపాలతో కూడుకున్నది. నీటి సమస్య విషయంలో దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రభుత్వాలు పనిచేయడం లేదు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు తాత్కాలిక ఉపశమనాలతో చేతులు దులుపుకుంటున్నాయి. నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి వ్యవసాయరంగం, పారిశ్రామికరంగం, నగరాల్లో వాటర్ వర్క్స్ అందరూ కలిసి సమన్వయంతో వ్యవహరించవలసి ఉంటుంది.

వాయిస్ : మరో ముఖ్యమైన విషయమేమంటే మనం రోజువారి నీటి వాడకంలో చాలా నీటిని వ్యర్థం చేస్తాం. ఇలా వ్యర్థమయ్యే నీరు 40 నుంచి 60 శాతం వరకు ఉంటుందని అంచనా. చాలా దేశాల్లో ఇలా నీటిని వ్యర్థంగా వాడడం జరగదు. నిజానికి భారతదేశం నీటివనరులు పుష్కలంగా ఉన్న దేశం. చాలా పెద్ద పెద్ద నదులు ఇక్కడ ఉన్నాయి. ఏటా సగటున 1170 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. ఏటా రిన్యూవబుల్ వాటర్ రిజర్వులు 1608 బిలియన్ క్యూబిక్ మీటర్లు. ప్రపంచంలో తాగునీటి రిజర్వుల్లో దాదాపు తొమ్మిదో వంతు ఇక్కడే ఉన్నాయి. భారతదేశంలో నీటిఎద్దడికి ముఖ్యమైన కారణం కేవలం నిర్వాహణ లోపమే. విచిత్రమేమంటే దేశంలో వరదలకు గురయ్యే ప్రాంతాల్లోనే ఆ తర్వాత నీటి ఎద్దడి కూడా ఉంటుంది. దేశంలో చిన్నా పెద్ద 4525 డ్యాములున్నాయి. అయినా దేశంలో తలసరి నీటి నిల్వ కేవలం 213 క్యూబిక్ మీటర్లు మాత్రమే. రష్యాలో ఇది 6,103 క్యూబిక్ మీటర్లు, ఆస్ట్రేలియాలో 4,733 క్యూబిక్ మీటర్లు, చైనాలో 1111 క్యూబిక్ మీటర్లు. అంటే మన ప్రభుత్వాలు ఆఫ్ సీజను కోసం నీటినిల్వలకు సరయిన ఏర్పాట్లు చేయనే లేదని చెప్పాలి. నీటి నిర్వహణ విషయంలో ఇస్రాయీల్ చాలా ప్రగతి సాధించింది. డ్రిప్ ఇరిగేషన్, వ్యర్థజలాలను సాగుకు వాడడం, ఇండ్లల్లో ఉపయోగించిన నీటిలో 80 శాతం శుద్ధి చేసి వ్యవసాయానికి వాడడం జరుగుతోంది. అక్కడ సాగునీటిలో దాదాపు 50 శాతం ఇలా శుద్ధి చేసిన జలాలే.

ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రకారం 2030 నాటికి భారతదేశం 50 శాతం నీటికరువును ఎదుర్కోబోతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏటా మనకు 1100 బిలియన్ క్యూబిక్ మీటర్లు అవసరం. 2025 నాటికి 1200 బిలియన్ క్యూబిక్ మీటర్లు అవసరమవుతాయి. 1951 లెక్కల ప్రకారం దేశంలో సగటున ప్రతి మనిషికి ఏటా 5200 క్యూబిక్ మీటర్ల నీళ్ళు లభించేవి. అప్పుడు జనాభా 35 కోట్లు మాత్రమే. 2010 నాటికి జనాభా చాలా పెరిగింది. సగటున ప్రతి మనిషికి ఏటా లభించే నీళ్ళు 1600 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే ఇది నీటి ఎద్దడిగానే భావించాలి. ప్రస్తుతం 2018లో దేశంలో సగటున ప్రతిఒక్కరికి 1400 క్యూబిక్ మీటర్లు మాత్రమే లభిస్తున్నాయి. రాబోయే ఒకటి రెండు దశాబ్దాల్లో ఇది సగటును 1000 క్యూబిక్ మీటర్లకు పడిపోవచ్చన్న అనుమానాలున్నాయి. మరో ముఖ్యమైన విషయమేమంటే లభిస్తున్న నీటిలో చాలా భాగం వాడకానికి పనికివచ్చేది కాదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ చెబుతోంది. ప్రస్తుతం సగటున ప్రతిఒక్కరికి కేవలం 938 క్యూబిక్ మీటర్ల నీరు మాత్రమే వాడకానికి తగినది దొరుకుతోందని తెలుస్తోంది. భూమిపై నీటిలో కేవలం 2.5 శాతం నీరు మాత్రమే మంచినీరు. జలం జీవాధారం. అందుకే ఐక్యరాజ్యసమితి 2010 జులై 28వ తేదీన నీటిని పొందడం మానవహక్కుగా తీర్మానించింది. సిటీబ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ విలియం బీటర్ నీటి ప్రాముఖ్యం గురించి రాస్తూ రానున్న కాలంలో చమురు, విలువైన లోహాల కన్నా నీరు విలువైందిగా మారిపోతుందన్నాడు.

ప్రపంచంలో పర్యావరణ మార్పుకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. చాలా దేశాలు క్లయిమేట్ ఛేంజ్ తట్టుకోడానికి సంసిద్ధమవుతున్నాయి. కాని మనం అలాంటి ప్రయత్నాలే చేస్తున్నట్లు కనబడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, పశువులకు నీటి ఎద్దడి సమస్య. బిందెడు నీళ్ళ కోసం మైళ్ళ కొద్ది నడుస్తున్న మహిళలు, మరోవైపు పవర్ ప్లాంట్లకు తరలిపోతున్న నీరు వీటన్నింటి గురించి ఆలోచించేది ఎవరు? కొన్ని ప్రాంతాల్లో నేల, నీరు చవగ్గా పరిశ్రమలకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు పునరాలోచంచవలసిన అవసరం ఉంది.

వర్షపాతం వల్ల లభించే నీటిలో 35 శాతం మాత్రమే నేడు ఉపయోగానికి వస్తుందన్న లెక్కలున్నాయి. వర్షపునీటిని నిల్వ ఉంచడానికి ఉపయోగపడే చెరువులు, కుంటలను పునరుద్ధరించడం, సాంప్రదాయిక జలపరిరక్షణ విధానాలను ప్రోత్సహించడం, ప్రజలను కూడా నీటి నిర్వహణలో భాగస్వాములు చేయడం చాలా అవసరం. నీతి ఆయోగ్ జూన్ 14వ తేదీన ప్రచురించిన కాంపోజిట్ వాటర్ మేనేజిమెంట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం నేడు చరిత్రలో ఎన్నడూ లేనంత నీటి ఎద్దడిని ఎదుర్కుంటోంది. దాదాపు 60 కోట్ల ప్రజలు అంటే దేశ జనాభాలో సగం మంది తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నారు. తాగునీరు అందుబాటులో లేనందువల్ల ఏటా రెండులక్షల మంది మరణిస్తున్నారు. ఇది సంక్షోభానికి ప్రారంభం మాత్రమే. పరిస్థితి మరింత దిగజారేలా ఉంది.

నీతి ఆయోగ్ నివేదికలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలున్నాయి. రానున్న కాలంలో ఈ సంక్షోభం మరింత క్లిష్టసమస్యగా మారబోతోంది. భారతదేశంలో ప్రస్తుతమున్న నీటి డిమాండ్ 2030 నాటికి రెట్టింపవుతుంది. కోట్లాది ప్రజలు నీటి కరువులో చిక్కుకుంటారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి తప్పనట్లు కనబడుతుంది కాబట్టి నీటి కరువు వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల భారత స్థూల జాతీయోత్పత్తి 6 శాతం పడిపోతుంది.

ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం 2030 నాటికి దేశంలో పెట్రోలు, డీజిలు వాహనాలన్నింటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. దేశప్రజలంతా ఆన్ లైన్ సదుపాయాలు వాడుకునేలా చేయడం, మలేరియాను పూర్తిగా నిర్మూలించడం తదితర లక్ష్యాలున్నాయి. ఇవన్నీ 2030 నాటికి సాధించాలనుకుంటున్నాం.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles