32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ రద్దు… కాంగ్రెస్ నేత పి.చిదంబరం!

తిరువనంతపురం: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని పార్లమెంటు మొదటి సెషన్‌లోనే రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం  అన్నారు.

చిదంబరం తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో సిఎఎ రద్దు ప్రస్తావన లేకపోయినప్పటికీ పార్టీ ఉద్దేశం ఆ చట్టం రద్దేనని స్పష్టం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో సిఎఎ గురించిన ప్రస్తావన లేనందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి, సిపిఐ(ఎం) నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటున్నది.

‘మేనిఫెస్టో సుదీర్ఘంగా ఉన్నందున’ సిఎఎ గురించి ప్రస్తావించలేదని చిదంబరం వివరించారు. పది సంవత్సరాల బిజెపి పాలన దేశానికి అపార నష్టం కలిగించిందని, పార్లమెంట్‌లో ‘ఆధిక్యాన్ని’ ఆ పార్టీ దుర్వినియోగం చేసిందని చిదంబరం ఆరోపించారు.

ఐదు చట్టాలను పూర్తిగా రద్దు చేస్తాం. నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ను. దానిలో ప్రతి పదాన్నీ రాశాను. ఉద్దేశం ఏమిటీ నాకు తెలుసు. సిఎఎ సవరణ కాకుండా రద్దు జరుగుతుంది. మేము ఆ విషయం స్పష్టం చేశాం’ అని చిదంబరం చెప్పారు.

ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు పార్లమెంట్ తొలి సెషన్‌లోనే సిఎఎను రద్దు చేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఆ చట్టాన్ని వ్యతిరేకించలేదన్న విజయన్ వ్యాఖ్యలను చిదంబరం తోసిపుచ్చుతూ, తిరువనంతపురం ఎంపి శశి థరూర్ పార్లమెంట్‌లో సిఎఎకు వ్యతిరేకంగా మాట్లాడారని తెలియజేశారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నకు లేదని తాను ఆశిస్తున్నట్లు చిదంబరం సమాధానం ఇచ్చారు.

“అయోధ్యలో ఇప్పుడు గుడి ఉంది. మేము సంతోషం గా ఉన్నాము. ప్రజలు ఆలయాన్ని కోరుకున్నారు, ఆలయం వచ్చింది. అది కథకు ముగింపు కావాలి. అయోధ్యలోని దేవాలయం రాజకీయాలలో లేదా ఎన్నికలలో ఎందుకు పాత్ర పోషిస్తుంది. దేశాన్ని ఎవరు పాలించాలి. ఇందులో ఎలాంటి పాత్ర ఉండకూడదు’ అని చిదంబరం అన్నారు.

జాతీయ సరిహద్దు భద్రత విషయంలో, బిజెపి ప్రభుత్వం “వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనా దళాలు ఆక్రమించుకున్నాయి” అనే సత్యాన్ని దేశ ప్రజల నుండి దాచిపెడుతోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు.

“ఇది లడఖ్‌కు చెందిన ఎంపీ సాక్ష్యమిచ్చిన వాస్తవం. అరుణాచల్ ప్రదేశ్ పౌరులు నిరూపించిన వాస్తవం. అందువల్ల వారు మన సరిహద్దులను భద్రపరిచారని చెప్పడం పూర్తిగా అబద్ధం’ అని చిదంబరం అన్నారు.

బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని కూడా చిదంబరం దుయ్యబట్టుతూ.. అది ఇక ఎంత మాత్రం జాతీయ పార్టీ కాదని, కాని ప్రధాని నరేంద్ర మోడీని ఆరాధించే ఒక తెగగా మారిందని ఆరోపించారు.

“మోడీ మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని సవరించవచ్చు… మనం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి” అని చిదంబరం అన్నారు.

కాంగ్రెస్, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఇన్నిరోజులు గళం విప్పిన విజయన్‌ను కాంగ్రెస్ నాయకుడు విమర్శించారు. ఈ ఎన్నికలను జాతీయ ఎన్నికలుగా చూడాలని వామపక్ష నేతను కోరారు.

ఇండియా బ్లాక్‌లో మిత్రపక్షమైన సీపీఐ(ఎం) కేరళలో ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల మాదిరిగానే పోరాడుతోందని ఆరోపించారు.

“జాతీయ దృక్కోణంలో, బిజెపితో పోరాడటానికి , ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు అర్హులు. దీని సమాధానం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీయే, సీపీఐ(ఎం) కాదు. సీపీఐ(ఎం) ఇప్పుడు అక్షరాలా ఒక రాష్ట్ర పార్టీ’ అని చిదంబరం అన్నారు.

ఇండియా కూటమికి ఓటు వేసి అధికారంలోకి వచ్చేలా చేయాలని ప్రజలకు మాజీ మంత్రి చిదంబరం విజ్ఞప్తి చేశారు.

“మోదీ మూడోసారి ఎన్నికైతే నేను ఇలా విలేకరుల సమావేశం నిర్వహించగలనో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. అలాంటప్పుడు మీరు బీజేపీ నేతలను ఏవైనా ప్రశ్నలు అడగడానికి స్వేచ్ఛగా ఉంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, ”అన్నారాయన.

లోక్‌సభ ఎన్నికల కోసం కేరళలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది, జూన్ 4న దేశవ్యాప్తంగా ఫలితాలు వెలువడనున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles